స్కానింగ్ మెషీన్లు పనిచేయట్లేదనడం అబద్ధం : కింగ్ కోఠి హాస్పిటల్ సూపరింటెండెంట్

స్కానింగ్ మెషీన్లు పనిచేయట్లేదనడం అబద్ధం : కింగ్ కోఠి హాస్పిటల్ సూపరింటెండెంట్
  • హరీశ్ రావు ఆరోపణలను ఖండించిన.
  • కింగ్ కోఠి హాస్పిటల్ సూపరింటెండెంట్

హైదరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: కింగ్ కోఠి హాస్పిటల్ లో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ మెషీన్లు పనిచేయడం లేదనే ప్రచారాన్ని కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఖండించారు. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. హాస్పిటల్ లో రెండు ఆల్ట్రాసౌండ్ మోషీన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, రోజుకు సగటున 80 నుంచి 100 మందికి స్కానింగ్ చేస్తున్నామని తెలిపారు. 

శనివారం అస్వస్థతకు గురైన విద్యార్థులకు కూడా ఇక్కడే స్కానింగ్ తీశామని, ఆ రిపోర్టులను కూడా ఆయన మీడియాకు చూపించారు. సీటీ స్కాన్ మిషన్ కూడా కండిషన్‌‌ లోనే ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రోగులు ఎలాంటి అపోహలు లేకుండా హాస్పిటల్ కు రావచ్చని, రక్త పరీక్షలు, స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. లక్షల మందికి సేవలు అందిస్తున్న హాస్పిటల్ పై తప్పుడు ప్రచారాలు చేయొద్దని అన్నారు.

పిల్లలు కోలుకుంటున్నారు

ఫుడ్ పాయిజన్ నుంచి పిల్లలు కోలుకుంటున్నారని సూపరింటెండెంట్ తెలిపారు. ‘‘బాగ్ లింగంపల్లి మైనార్టీ హాస్టల్‌‌ కు చెందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 16 మంది, శనివారం ఉదయం మరో నలుగురు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చారు. వెంటనే స్పందించిన డాక్టర్లు వారిని పరీక్షించి.. డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. మెడిసిన్ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులంతా కోలుకుంటున్నారు’’ అని స్పష్టం చేశారు. 

ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు సస్పెన్షన్: మంత్రి అజారుద్దీన్

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్, కిచెన్ ఇన్ చార్జ్ లను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. కింగ్ కోఠి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మైనార్టీ వెల్ఫేర్ శాఖ సెక్రటరీ షఫీఉల్లాహ్ తో కలిసి శనివారం మంత్రి పరామర్శించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ ను అడిగి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 

తాము అండగా ఉంటామని , మెరుగైన వైద్యం అందిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఫుడ్ మెటీరియల్ సప్లై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ తరహా ఘటనలపై హరీశ్​రావు రాజకీయం చేయడం సరికాదని.. విమర్శల కంటే సలహాలు ఇవ్వాలని సూచించారు. మాజీ మంత్రి అయి ఉండీ ప్రభుత్వ వైద్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు.