నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి

నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి
  • నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి
  • ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు తెలంగాణ జాతిరత్నాలు, ఆత్మ గౌరవాన్ని కాపాడే నేతలు ఎట్ల అయ్యారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి 26 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకునేలా ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ఇందులో ఏ ఒక్కరూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండ, పార్టీ ఫిరాయించారని గుర్తు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫామ్ హౌస్ వీడియో’ వివాదం కేసును సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ‘న్యాయ విచారణకు ఆదేశించరు. సీబీఐ దర్యప్తు జరగకుండా దొడ్డిదారిన జీవోలు ఇస్తరు. రాజీనామాలు చేయించకుండానే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రజలను ఇంకా మభ్యపెట్టే ఆలోచనలు మానుకోండి’ అని హెచ్చరించారు.

నలుగురు ఆర్టిస్టులతో వీడియో రికార్డ్
నలుగురు ఆర్టిస్టులతో వీడియో రికార్డ్ చేసి.. లొల్లి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని కిషన్​రెడ్డి అన్నారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పింది చూస్తుంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరో ఒకరు  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫొటో దిగినంత మాత్రానా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో హోంమంత్రికి సంబంధం ఉందనడం అర్థరహితమన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ప్రజల, అమరుల ఆకాంక్షాలను పూర్తిచేయాలన్న సంకల్పంతో వచ్చే వారిని పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. చేరికల కోసం రాష్ట్ర బీజేపీలో ఒక కమిటీ ఉందన్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలనే విషయంలో తాము స్పష్టంగా ఉన్నామన్నారు.

ఎన్టీఆర్ పై  చెప్పులేయించారు
ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ లో చెప్పులేయించిన వ్యక్తి (కేసీఆర్),  ఇవాళ  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఫైర్ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.