
హైదరాబాద్, వెలుగు: బీజేపీ చేపట్టిన ‘చలో బాటసింగారం’ కార్యక్రమం కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్టుతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు ఇవ్వడం లేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మండలం బాటసింగారం గ్రామంలో పూర్తికాని ఇండ్లను పరిశీలించేందుకు గురువారం కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి శంషాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి బాటసింగారానికి బయలుదేరారు. అనుమతి లేదనే కారణంతో శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద పోలీసులు డీసీఎం వ్యానును అడ్డుగా పెట్టి కిషన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కిషన్ రెడ్డి తన వాహనం దిగి వర్షంలోనే తడుస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ‘‘కేంద్ర మంత్రిగా నాకు దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. నేనేమైనా క్రిమినల్నా.. ఉగ్రవాదినా.. నన్ను అడ్డుకోవడం ఏమిటి?”అని పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. 75 ఏండ్ల భారతదేశ చరిత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన ఓ కేంద్ర మంత్రిని అరెస్టు చేసిన చరిత్ర ఎక్కడా లేదని అన్నారు.
రజాకార్ల రాజ్యంకన్నా అధ్వాన్నంగా రాష్ట్రంలో పాలన ఉందని.. నిజాం పాలనలా కల్వకుంట్ల పాలన సాగుతున్నదని విమర్శించారు. కిషన్ రెడ్డి వెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ‘‘బీఆర్ఎస్ కార్యకర్తలు అనుమతి లేకుండా రోడ్లపై ధర్నాలు చేస్తే.. చూస్తూ కూర్చుండే మీరు.. మాపట్ల ఇట్ల వ్యవహరించడం ఏమిటి?” అని పోలీసులను రఘునందన్‌రావు నిల దీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు కిషన్ రెడ్డిని బలవంతంగా ఆయన వాహనంలోకి ఎక్కించారు. అనంతరం కిషన్ రెడ్డి డ్రైవర్‌ను దించి డీసీపీ స్థాయి అధికారి ఆ వాహనాన్ని నడుపుకుంటూ హైదరాబాద్ సిటీ వైపు బయలుదేరారు. కిషన్ రెడ్డి ఉన్న వాహ నానికి వెనుకా, ముందు పెద్ద సంఖ్యలో పోలీసు వాహనాలు బయలుదేరాయి. కిషన్ రెడ్డిని ఎటువైపు తీసుకెళ్తున్నారో కొద్దిసేపు ఎవరికి అర్థం కాలేదు. సిటీలోని రూట్లు మారుస్తూ.. వివిధ ప్రాంతాల మీదుగా తిప్పుతూ.. చివరికి బీజేపీ స్టేట్ ఆఫీసులో వదిలిపెట్టారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ను గద్దె దించే వరకు పోరు
“కేసీఆర్ మాతో ఆట మొదలెట్టిండు. ఇక యుద్ధం మేము కొనసాగిస్తాం. మా రాజకీయ జీవితం పోరాటాలతోనే మొదలైంది. మీలా పార్టీలు మేం మార్చలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్లే హక్కు కేంద్ర మంత్రిగా నాకు లేదా?” అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండి పడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్‌లో కూర్చొని అణచివేస్తారా అని దుయ్యబట్టారు. ‘‘ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు వారికి ఇవ్వడం లేదు. బాటసింగారంలో మధ్యలోనే వదిలేసిన ఇండ్లను చూద్దామని బయలుదేరితే అరెస్టు చేయడం ఏమిటి? మా నాయకులును హౌస్ అరెస్టులు చేశారు. పోలీసులు మా పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కల్వకుంట్ల కుటుంబంతో, బీఆర్ఎస్తో యుద్ధానికి మేం సిద్ధం. ప్రజల సమస్యల తరఫున ఈ యుద్ధం కొనసాగిస్తాం. ఎన్నో సార్లు జైలుకు వెళ్లాం. తండ్రిని అడ్డం పెట్టుకొని మాకు పదవులు రాలేదు.
బీఆర్ఎస్ పాపాలు పండాయి. కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలి. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా తెచ్చే బాధ్యత నాది” అని కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. బీఆర్ఎస్ను గద్దెదించే వరకు పోరాడుతామని చెప్పారు. ‘‘ఖరీదైన ఇండ్లు కట్టుకోవడానికి, విమానాలు కొనుక్కోవడానికి కేసీఆర్‌కు డబ్బులుంటయ్. కానీ పేదలకు ఇండ్లు కట్టడానికి డబ్బులు ఉండవా?” అని ప్రశ్నించారు. రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు గురువారం జరిగిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2. 5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని, వాటిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రిగా బయలుదేరిన తనను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని, అమర్యాదగా వ్యవహరించిందని ఫిర్యాదు లేఖలో ఆయన పేర్కొన్నారు.
తెల్లవారుజాము నుంచే గృహనిర్బంధాలు, అరెస్టులు
బీజేపీ గురువారం ‘చలో బాటసింగారం’ ప్రోగ్రామ్‌కు పిలుపునివ్వడంతో హైదరాబాద్ సిటీలో ఉన్న పార్టీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచే నేతల ఇండ్లకు పోలీసులు చేరుకొని వారిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. హౌజ్ అరెస్టు అయినవారిలో డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్, కొప్పు బాషా, బండ కార్తీకరెడ్డి, రాణి రుద్రమ తదితరులు ఉన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పార్టీ స్టేట్ ఆఫీసు ముందు అరెస్టు చేశారు. ఆఫీసు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్టు చేయడంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. అలాగే, కిషన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.