రా, ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడం దుర్మార్గం..దేశంపై కాంగ్రెస్ కుట్రలు సరికాదు: కిషన్ రెడ్డి 

రా, ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడం దుర్మార్గం..దేశంపై కాంగ్రెస్ కుట్రలు సరికాదు: కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాద ముప్పు నుంచి దేశాన్ని కాపాడే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)ను బలహీన పరచాలని చూడటం దేశ ద్రోహమే అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ పై విషం చిమ్మడం కుట్రలో భాగమేనన్నారు. విదేశీ అదృశ్య హస్తాలతో కలిసి దేశాన్ని బలహీనపరుస్తున్న కాంగ్రెస్ వైఖరిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన దేశ వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకుందన్నారు. విదేశీ సంస్థలతో అంటకాగుతూ మన దేశ రక్షణ సంస్థలను, సాంస్కృతిక సంస్థలను కించపరచాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్..  భారత్‌‌‌‌‌‌‌‌పై ఇచ్చిన పక్షపాత నివేదికను తీవ్రంగా ఖండించారు.

భారత్‌‌‌‌‌‌‌‌పై ద్వేషంతో, అసంబద్ధమైన కథనాలతో ఆ సంస్థ ఏకపక్షంగా నివేదికలు ఇస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, సాయుధ బలగాలు, లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన ప్రతి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.