కేసీఆర్​ కుటుంబానికి ఫాంహౌస్ లు.. పేదలకు పూరి గుడిసెలు: కిషన్​రెడ్డి

కేసీఆర్​ కుటుంబానికి ఫాంహౌస్ లు.. పేదలకు పూరి గుడిసెలు: కిషన్​రెడ్డి

ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన డబుల్​ బెడ్రూం హామీని నెరవేర్చకుండా ప్రజలను  సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి, టీబీజేపీ చీఫ్​ కిషన్​రెడ్డి విమర్శించారు. డబుల్​ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ లో ఆయన బీజేపీ నేతలతో కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

గారడీ చేసి ప్రజలను నమ్మించి గొంతు కోయడం కేసీఆర్​కు వెన్నతో పెట్టిన విద్య అని కిషన్​రెడ్డి ఆక్షేపించారు. మిగులు బడ్జెట్​ఉన్న రాష్ట్రాన్ని దోచుకుని కల్వకుంట్ల కుటుంబం  రూ.7 లక్షల కోట్ల అప్పలపాలు చేసిందని ఆరోపించారు. 

బీఆర్ ఎస్​ప్రజాప్రతినిధులు భూకబ్జాలు, ఇసుక మాఫియా, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా మళ్లీ ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ఈ సారి బీఆర్​ఎస్​ ని ప్రజలు నమ్మే పరిస్థితే లేదని అన్నారు. 

మరో 4 నెలల్లో కేసీఆర్​ ఫాంహౌస్​కే పరిమితమవుతారని..  ఉన్న రోజులైనా ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్ని తీసుకోవాలని కోరారు.  కల్వకుంట్ల పాలనలో రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు నెరవేరలేదని వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సీఎంకు ప్రగతి భవన్, మంత్రులు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్లు కట్టించిన కేసీఆర్​కు పేదలకు ఇళ్లు కట్టించలేకపోతున్నారని అన్నారు. పేదవారికి ఇళ్లు రావాలంటే కేసీఆర్​ సర్కార్​ పోవాలని, డబుల్​ఇంజిన్​ సర్కార్​ రావాలని అన్నారు. 

డబ్బులు తీసుకుని ఇండ్లు ఇస్తున్రు..

బీఆర్​ఎస్​ నేతలు రాష్ట్రంలో అక్కడక్కడా కట్టిన డబుల్​బెడ్రూం ఇళ్లను పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. చాలా చోట్ల అడపాదడపా కట్టిన ఇళ్లను సైతం పేదలకు పంచట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏళ్లుగా కిరాయి ఇళ్లల్లో ఉంటున్న పబ్లిక్ డబుల్​బెడ్రూంల కోసం ఎదురు చూసి.. చూసి వారి కళ్లు కాయలు కాశాయని.. వారి విశ్వాసాన్ని కేసీఆర్​కోల్పోయారని అన్నారు. గులాబీ కండువా వేసుకున్న వారికే ఇళ్లు కేటాయిస్తున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. 

ఎన్నికల హామీలో సొంత జాగా ఉన్న వారికి రూ.6 లక్షలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని ప్రకటించి..రూ.3 లక్షలే  ఇస్తున్నట్లు చెప్పి ఇప్పుడు అదీ అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు.   కట్టిన ఇళ్లను పేదలకు కేటాయించేవరకు బీజేపీ పోరుబాట ఆపేది లేదని స్పష్టం చేశారు.