బీజేపీపై విష ప్రచారాన్ని తిప్పికొట్టండి : కిషన్ రెడ్డి

బీజేపీపై విష ప్రచారాన్ని తిప్పికొట్టండి :   కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:   బీజేపీపై అసత్య, విష ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్​కు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ సోషల్ మీడియా వారియర్స్​కు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను, కుటుంబ, అవినీతి, నియంత పాలనపై సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇదే సమయంలో  కేంద్రం ఏయే స్కీమ్​ల కింద ఎన్ని నిధులను తెలంగాణకు ఇచ్చిందనేది జనానికి వివరించాలన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. 

పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జీ ప్రకాశ్ జవదేకర్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జాఫర్ ఇస్లాం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సలహాదారు శ్వేతా శాలినీతో పాటు రాష్ట్ర నేతలు పలువురు పాల్గొని మాట్లాడారు. ఒక్కో అంశంపై ఒక్కో నేత దిశా నిర్దేశం చేశారు. సాయంత్రం ముగింపు సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తిరోగమన దిశలోకి వెళ్తుందన్నారు. ఆ పార్టీకి గడ్డుకాలం ఉందని సర్వేల్లో తేలిపోయిందని, అందుకే పూర్తిగా గోబెల్స్ ప్రచారానికి దిగుతోందన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.   

కుటుంబ పార్టీలకు పాతర 

దేశంలోని కుటుంబ పార్టీలకు, అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కాంగ్రె స్​లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరారని, ఇప్పుడు వారే నీతులు చెప్తున్నారని అన్నారు.  

పార్టీకి మూడు మీడియా సెంటర్లు  

హైదరాబాద్​తో పాటు వరంగల్, మహబూబ్ నగర్ కేంద్రంగా మూడు మీడియా సెంటర్లను నిర్వహించాలని మీడియా వర్క్​షాపులో నిర్ణయించారు. పార్టీకి చెందిన రాష్ట్ర, జాతీయ నేతలు ఆయా సెంటర్ల నుంచే మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. మీడియా, సోషల్ మీడియా టీంలను హైదరాబాద్ కేంద్రంగా పార్టీ స్టేట్ ఆఫీసులోని వార్ రూం నుంచి జాఫర్ ఇస్లాం, శ్వేతా శాలినీ మానిటరింగ్ చేయనున్నారు. కాగా, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్న డిమాండ్​తో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయనున్నారు. ధర్నాను విజయవంతం చేయడంపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీజేపీ ముఖ్య నేతలతోనూ కిషన్ రెడ్డి సమావేశమయ్యారు.