నాడు ఆ నిజాం..  నేడు ఈ నిజాం

నాడు ఆ నిజాం..  నేడు ఈ నిజాం

వారు లేకుంటే తెలంగాణ లేదనుకుంటున్నరు
ఘనమైన చరిత్ర తెలంగాణ సొంతం
చరిత్రను విస్మరిస్తే మనుగడ ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కరీంనగర్, వెలుగు:

‘‘చరిత్రను విస్మరిస్తే మనుగడ అనేది ఉండదు. చరిత్రను మార్చాలని చూడటం దుర్మార్గం. తాము లేకుంటే అసలు తెలంగాణే లేదని అనుకుంటున్నారు. తెలంగాణకు నాడు ఆ నిజాం ఉంటే..  నేడు ఈ నిజాం తయారయ్యాడు..” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‍ రెడ్డి అన్నారు. త్యాగాలు, బలిదానాల వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ గత వైభవ చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘ప్రజ్ఞా భారతి’ ఆధ్వర్యంలో కరీంనగర్‍ లోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్‍ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉందని, ఈ చరిత్రను  రాబోయే తరాలకు అందించాలన్నారు.

తెలంగాణపై ఎన్నో దాడులు..

కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ
బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెం కటస్వామిని
గజమాలతో సన్మానిస్తున్న బీజేపీ కార్యకర్తలు

తెలంగాణ జీవనం, వైభవంపై జరిగినన్ని దాడులు, కుట్రలు ఎవరిపైనా, ఎక్కడా జరగలేదని, ఇక్కడి సంస్కృతిని అణిచివేసే ప్రయత్నాలు అనేక ఏళ్లపాటు జరిగాయన్నారు. మరుగున పడిన చరిత్రను తెలుసుకొని, పునర్ వైభవం సాధించేందుకు తెలంగాణ వైభవం లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.

ప్రస్తుతం సిరియాలో జరుగుతున్న దారుణాల వంటివి తెలంగాణలో నిజాం, రజాకార్ల కాలంలోనే జరిగాయని కిషన్ రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజలు వారి బాధలను తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు తరలిపోయారన్నారు. అయినా, ఇక్కడ వందల ఏళ్లుగా మతసామరస్యం కొనసాగుతోందన్నారు.

తెలంగాణ సంస్కృతిని మర్చిపోలేదని, ఇది కళలకు, కవులకు నిలయం అని కొనియాడారు.  తెలంగాణ కవులు ఏసీ రూముల్లోంచి కాదు ప్రజల గొంతుకలై వచ్చారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, గత వైభవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లవుతోందని,  ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అలా చేయకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించారు.

కేంద్ర స్కీములపై సమీక్ష

రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టి నిధులు మంజూరు చేయనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ మీటింగ్‌ హాల్‌లో కేంద్ర పథకాల అమలు తీరుపై ఎంపీ బండి సంజయ్​కుమార్, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, జడ్పీ చైర్మన్​కనుమల్ల విజయ, కలెక్టర్​ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి సమీక్షించారు. పథకాలను జిల్లాలో వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.