తలసేమియా చిన్నారులకు కోలిండియా భరోసా

తలసేమియా చిన్నారులకు కోలిండియా భరోసా
  • రెయిన్‌‌‌‌బో హాస్పిటల్స్ తో ఒప్పందంపై కిషన్ రెడ్డి హర్షం

హైదరాబాద్, వెలుగు: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు కోలిండియా లిమిటెడ్ ముందుకు రావడంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తలసేమియా బాల సేవా యోజన కింద కోలిండియా, రెయిన్‌‌‌‌బో చిల్డ్రన్ హాస్పిటల్ మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ కోసం ఒక్కో బాధితుడికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. 

‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తలసేమియా, గుండె జబ్బులతో బాధపడే పిల్లల కష్టాలను కళ్లారా చూశా. అప్పట్లో మందకృష్ణ మాదిగతో కలిసి పేద పిల్లల వైద్యం కోసం ట్యాంక్ బండ్ ధర్నా చేశాం. మా పోరాటానికి తలొగ్గి నాటి సీఎం వైఎస్ఆర్ ఉచిత వైద్యానికి హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం రావడానికి మా పోరాటం కూడా ఒక కారణం’ అని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.

800 మందికి బోన్ మ్యారో ఆపరేషన్లు

కోలిండియా చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 800 మంది పిల్లలకు బోన్ మ్యారో ఆపరేషన్లు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. రెయిన్‌‌‌‌బోతో కలిపి ఇప్పటివరకు 17 హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా  కేంద్రం 42 కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తున్నదన్నారు. 

వైద్యం కోసం విదేశాలకు వెళ్లే పనిలేకుండా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని, పీజీ సీట్లను భారీగా పెంచామని వెల్లడించారు. తలసేమియా నిర్మూలనకు ఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు.