మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపండి

మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపండి
  • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: మహబూబ్‌‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో  రైళ్లను ఆపాలని  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్–హజరత్ నిజా ముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును ( ట్రైన్​ నెం.12649/12650) మహబూబ్ నగర్ లో ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాచిగూడ మీదుగా వెళ్లే ఈ ట్రైన్ కర్నూలు చేరుకునే వరకు 200 కి.మీ మేర మధ్యలో ఎక్కడా ఆగదని గుర్తు చేశారు.

మహబూబ్ నగర్​లో ట్రైన్ హాల్ట్ ఉంటే ఢిల్లీ, బెంగళూరు ప్రయాణించే వారికి హైదరాబాద్‌‌కు రావాల్సిన అవసరం ఉండదని సూచించారు. చెంగల్ పట్టు–-కాచిగూడ ఎక్స్‌‌ప్రెస్ (ట్రైన్​ నెం.17651/17652)కు షాద్‌‌నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో  హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలోని ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్నారు.

కాగా తెలంగాణలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణనీయమైన పురోగతి జరుగుతోందని, మౌలికవసతుల కల్పన వేగవంతమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకుగానూ రైల్వే శాఖ మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.