పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : కిషన్ రెడ్డి
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​పైసమాంతర పోరు: కిషన్ రెడ్డి
  • జనసేనతో పొత్తు ఉండదని పరోక్ష సంకేతాలు
  • వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్​
  • రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న తరుణ్ చుగ్
  • బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆఫీస్​ బేరర్ల మీటింగ్

హైదరాబాద్, వెలుగు : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసేది లేదని కేడర్​కు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎంపీ ఎన్నికల సన్నద్ధతపై కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడు తూ.. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ రానుందని, పార్టీ నేతలు ఎన్నికలకు రెడీగా ఉండాలని, ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలని సూచించారు. 

ఈ నెలాఖరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. ఉమ్మడి పది జిల్లాల వారీగా అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలు వ్యక్తిగత ప్రతిష్ట కోసం.. ఇతరులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని కిషన్​రెడ్డి హెచ్చరించారు. కాగా, కిషన్ రెడ్డికి రష్యా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది మాస్కో వేదికగా జరగనున్న ‘4వ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం’ సదస్సుకు హాజరుకావాలని ఆ దేశ ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్ లేఖ రాశారు. శుక్రవారం కేంద్ర మంత్రి కార్యాలయం ఈ అంశాన్ని వెల్లడించింది.

అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలె : తరుణ్ చుగ్

రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఈ నేపథ్యంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ దిశా నిర్దేశం చేశారు. దేశంలో మోదీ పాలన తీరును, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి రెడీ : లక్ష్మణ్

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని హైకమాండ్ ఆదేశిస్తే.. ఎంపీగా పోటీకి సిద్ధమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటానన్నారు.

కిషన్ రెడ్డితో డీకే అరుణ భేటీ 

బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డితో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భేటీ అయ్యారు. రాను న్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీకి ఆమె సిద్ధంగా ఉన్నారు. అయితే, అక్కడి నుంచి పోటీకి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కూడా ఆసక్తి చూపిస్తుండడంతో కిషన్ రెడ్డితో డీకే అరుణ భేటీ పార్టీలో చర్చనీయాంశమైంది. 

ఇయ్యాల్టి నుంచి వికసిత్ భారత్  సంకల్ప యాత్రలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్​​పై ప్రచారం చేసేందుకు శనివారం నుంచి 40 రోజుల పాటు  రాష్ట్రం అంతటా 'వికసిత్​ భారత్​సంకల్ప్​యాత్ర' జరగనుంది. జనవరి 26 వరకు  కొనసాగనున్న యా త్రను శనివారం  ప్రధాని మోదీ వర్చువల్​గా ప్రారంభిస్తారు.  లోకసభ ఎన్నికలతో పాటు తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా  ప్రజలకు చేరువకావడానికి ఈ యాత్ర పనికి వస్తుందని బీజేపీ ఆశిస్తోంది.  ఇతర రాష్ట్రాల్లో ఈ యాత్ర గత నెలలోనే ప్రారంభం కాగా.. అసెంబ్లీ ఎన్నికల కారణంగా  తెలంగాణలో వాయిదా పడింది. శుక్రవారం జరిగిన బీజేపీ స్టేట్ ఆఫీసు బేరర్ల సమావేశంలో రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ పై చర్చించి, యాత్ర షెడ్యూల్ ను పార్టీ నేతలకు వివరించారు.