పార్టీ ఆఫీసు నుంచి పార్లమెంటు దాకా..

పార్టీ ఆఫీసు నుంచి పార్లమెంటు దాకా..

హైదరాబాద్, వెలుగుకేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి జి.కిషన్​రెడ్డికి చాన్స్​ దక్కింది. సికింద్రాబాద్​లో ఎంపీగా గెలిచిన కిషన్​రెడ్డి గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర బీజేపీలో సీనియర్​ అయిన కిషన్​రెడ్డి.. చిన్న వయసులోనే రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. బీజేపీలో హైదరాబాద్​ ఆఫీసు ఇన్​చార్జిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. పార్టీ అనుబంధ విభాగాల్లో, పార్టీలో పలు పదవులు చేపట్టారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర మంత్రిగా చాన్స్​ దక్కించుకున్నారు.

బీజేపీ ఆవిర్భావం నుంచి..

కిషన్​రెడ్డి 1964 లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్​లో జన్మించారు. పాతబస్తీలోని సోదరి ఇంట్లో ఉంటూ యాకుత్​పురాలోని ధర్మవంత్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. తొలుత జనతా పార్టీ, తర్వాత బీజేపీ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో సీనియర్​ నేత బండారు దత్తాత్రేయ కిషన్​రెడ్డికి పార్టీ ఆఫీసు ఇన్​చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. టూల్ డిజైనింగ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తక్కువ సమయంలోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

1983 నుంచి 2004 మధ్య బీజేపీ యూత్​ వింగ్​ యువ మోర్చాలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 2004లో యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే అద్వానీ, మోడీ, సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్​నాథ్, అమిత్​షా తదితర పార్టీ అగ్రనేతలతో కిషన్​రెడ్డికి పరిచయాలు పెరిగాయి. మోడీతో కలిసి పార్టీ ప్రచారక్​గా దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తర్వాత ఉమ్మడి ఏపీకి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. క్రమశిక్షణ, నిజాయతీగల నేతగా గుర్తింపు పొందారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా..

బీజేపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతున్నా కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1999లో మొదలైంది. ఆ ఏడాది తొలిసారిగా హైదరాబాద్​లోని కార్వాన్​ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో హిమాయత్ నగర్ సెగ్మెంట్లో తొలిసారి గెలిచారు. 2009, 2014 ఎలక్షన్లలో అంబర్ పేట్​లో గెలిచారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనకు సికింద్రాబాద్​ ఎంపీ సీట్లో అవకాశం ఇచ్చింది. ఇక్కడ తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు.