మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని కేసీఆర్కు అర్థమైంది : కిషన్ రెడ్డి

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని కేసీఆర్కు అర్థమైంది : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : BRS పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్ కు అర్థమైనట్లు తెలుస్తోందన్నారు. రోజు రోజుకూ తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైందన్నారు. బీజేపీకి అన్నివర్గాల్లో గ్రాఫ్ పెరుగుతోందని, కేసీఆర్ లో నెలకొన్న భయంతోనే ఆయన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో దొంగ దీక్షలు చేస్తారని, తెలంగాణలో మాత్రం 33 శాతం సీట్లు కేటాయించకుండా.. కేవలం 6 సీట్లే మహిళలకు కేటాయించారని చెప్పారు. ఇదేనా కేసీఆర్ కుటుంబానికి వచ్చే లెక్కలు అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పారన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన అభ్యర్థులనే ఎన్నికల బరిలో దింపుతూ ఆ పార్టీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.

మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తమ ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోందన్నారు కిషన్ రెడ్డి. ఐదేళ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో చేస్తున్న అవినీతి, అక్రమాలకు పచ్చజెండా ఊపినట్లయిందన్నారు. నిజాయితీగా పోటీ చేస్తే ఎలాగూ గెలిచేది లేదు.. కాబట్టి కనీసం అక్రమంగా సంపాదించిన డబ్బుతోనైనా ప్రయత్నించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని ఆరోపించారు.