మేం ఆట మొదలు పెడితే టీఆర్ఎస్ కు దిమ్మ తిరుగుతది

మేం ఆట మొదలు పెడితే టీఆర్ఎస్ కు  దిమ్మ తిరుగుతది

 

  • ప్లాన్ ప్రకారమే భైంసాలో మజ్లిస్ దౌర్జన్యాలు
  • చిన్నారిపై అత్యాచారం జరిగితే కూడా కేసు పెట్టరా?
  • పోలీసుల కండ్ల ముందే దాడులు జరుగుతున్నా పట్టించుకోరా?
  • కేటీఆర్ షాడో సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నరు
  • మమత అడుగు జాడల్లో కేసీఆర్ పాలన: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఇంకా అసలు ఆట మొదలు పెట్టలేదని, ఆ ఆట మొదలైతే.. టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. ఏ ఎన్నికలు వచ్చినా కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శించడం, తప్పుడు ప్రచారాలు చేయడం కేసీఆర్ కుటుంబానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అండతోనే భైంసాలో మజ్లిస్పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని తన ఇంట్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భైంసాలో జరిగిన ఘటనలపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పారు. దీనిపై త్వరలోనే కేంద్ర హోంశాఖ సెక్రటరీని కలుస్తానన్నారు.  భైంసాలో పథకం ప్రకారం హిందువులపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్ సహాయంతోనే మజ్లిస్  ఇవన్నీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మజ్లిస్ ఇలాగే ప్రవర్తించిందని, అప్పటి నుంచి ఇప్పటిదాకా  పోలీసులు మజ్లిస్ నేతలపై చర్యలు మాని, చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోలీసుల కండ్ల ముందే ఆస్తులను ధ్వంసం చేస్తున్నా, దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయిన దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా కనిపించాయన్నారు. చివరకు నాలుగేండ్ల చిన్నారిని యువకుడు అత్యాచారం చేస్తే పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.  ఆ పాపను బీజేపీ నేతలు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారని ఆయన చెప్పారు. తమ పార్టీ ఒత్తిడి తేవడంతో కేసు నమోదు చేశారని అన్నారు. నేరస్తులపై చర్యలు తీసుకోకుండా పోలీసులను టీఆర్ఎస్ అడ్డుకుంటోందని,  ప్రస్తుతం భైంసాలో పోలీసుల చేతుల్ని సంకెళ్లతో బంధించినట్లు కనిపిస్తోందన్నారు. 

కేటీఆర్ షాడో సీఎం

సీఎం కొడుకునన్న బిరుదుతో మంత్రి కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘అసలు ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని శాసిస్తున్నరు?  ఏ అధికారంతో అన్ని శాఖల మీద పెత్తనం చేస్తున్నరు?” అని  ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోడీ అమ్మేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘కేసీఆర్ కుటుంబం, ఒవైసీ కుటుంబం తెలంగాణను కొనేసినట్టు వ్యవహరిస్తున్నాయి. పక్క రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడే ముందు, రాష్ట్రంలోని భైంసాలో జరిగిన హింసాత్మక ఘటనలపై మాట్లాడాలి. అత్యాచారానికి గురైన చిన్నారిని, ఘర్షణల్లో ఇబ్బంది పడుతున్న వారిని రక్షించాల్సింది పోయి.. ఓట్లు పొందాలనే దుర్మార్గపు విధానాన్ని అవలంబిస్తున్నరు” అని మండిపడ్డారు. అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరు ఉందని, గోరంత చేసి కొండంత చూపించడం కేసీఆర్కు  వెన్నతో పెట్టిన విద్యని ఆయన విమర్శించారు.

మజ్లిస్ ఏం చెప్తే దానికి కేసీఆర్ జీ హుజూర్  

బెంగాల్ సీఎం మమతను ఆదర్శంగా తీసుకొని, ఆమె అడుగు జాడల్లో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. టీఎంసీ సర్కార్ పై అక్కడి ప్రజలు చేస్తున్న తిరుగుబాటును కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘మమత బంగ్లాదేశ్ వ్యక్తులకు, కేసీఆర్ మజ్లిస్కు అండగా వ్యవహరిస్తున్నరు. మజ్లిస్ నేతలు ఏం చెప్పినా.. కేసీఆర్ ‘జీ హుజూర్’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నరు” అని ఆరోపించారు. నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు నిధులు లేవు, నియామకాలు లేవన్నారు. యూనివర్సిటీల్లో ఏడేండ్లుగా ఒక్క నియామకం జరగలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేపట్టి అప్పగిస్తే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పారు.