- దాడి జరగలేదన్న ఇజ్రాయెల్.. బయటకొచ్చి మాట్లాడిన నెతన్యాహు
- ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
- రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్న ఐఏఈఏ చీఫ్
టెహ్రాన్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీసుపై మిసైళ్లతో మెరుపుదాడి చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) సోమవారం వెల్లడించింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ప్రాంతంలోనూ అటాక్ చేశామని ఐఆర్ జీసీ పేర్కొంది. అయితే, నెతన్యాహు ఆఫీసుపై దాడి చేసినా.. ఆయన పరిస్థితి తెలియరాలేదని వెల్లడించింది. ‘‘క్రిమినల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీసుతో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ప్రాంతంలో మేము సర్ ప్రైజ్ అటాక్ చేశాం.
ఖైబర్ షేఖన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి జరిపాం” అని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ప్రకటనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తమ ప్రధాని ఆఫీసుపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. ఈ ప్రచారం జరుగుతుండగానే నెతన్యాహు బయటకు రావడం విశేషం. ఇరాన్ మిసైల్ దాడి కారణంగా చనిపోయిన ఇజ్రాయెలీ పౌరుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కాగా, ఇరాన్ కు చుట్టుపక్కల ఉన్న న్యూక్లియర్ స్థావరాలపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ చుట్టపక్కల ఉన్న న్యూక్లియర్ స్థావరాల గురించి ఆలోచిస్తే తమకు చాలా ఆందోళనగా ఉందని పేర్కొన్నారు.
