అణగారిన వర్గాల మీటింగ్​కు ప్రధాని రావడం గర్వకారణం : కిషన్ రెడ్డి

అణగారిన వర్గాల మీటింగ్​కు ప్రధాని రావడం గర్వకారణం : కిషన్ రెడ్డి
  • అణగారిన వర్గాల మీటింగ్​కు ప్రధాని రావడం గర్వకారణం
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ30 ఏండ్ల నుంచి పోరాటం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రధాని వరంగల్ వచ్చినపుడు మందకృష్ణ కలిసి మాదిగ సామాజిక సమస్యపై సహకారం కావాలని అడిగారని, ఇంత తక్కువ వ్యవధిలో ప్రధాని అంగీకరించి మీటింగ్ కు రావటం గర్వకారణమన్నారు. శనివారం పరేడ్ గ్రౌండ్​లో జరిగిన అణగారిన వర్గాల విశ్వరూప మహాభలో  కిషన్ రెడ్డి మాట్లాడారు. వర్గీకరణ కోసం మందకృష్ణ ఎన్నో విమర్శలు, అపవాదులు, అవమానాలు ఎదుర్కొన్నారని, అన్నీ భరిస్తూ 30 ఏండ్లు ఉద్యమం కొనసాగించారన్నారు. 

మాదిగ సమాజం మీటింగ్ కు ప్రధాని రావటం వారి తొలి విజయమన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమం కాదని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అంబేద్కర్ చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నపుడే వర్గీకరణ అంశంపై నిర్ణయం తీసుకున్నారని, ఏ పార్టీ నిర్ణయాలు తీసుకున్నా అమలు చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక రకాల సామాజిక సమస్యలను పరిష్కరించే  దిశగా ప్రధాని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చారన్నారు. 

మా వాటా మాకు దక్కాలి : మందకృష్ణ మాదిగ

“ఎస్సీల్లో మాదిగలకు అన్యాయం జరిగింది అని అన్ని కమిషన్లు చెప్పాయి. జనాభా ఉన్నా విద్య ఉద్యోగాల్లో న్యాయం జరగట్లే. ఎస్సీ వర్గీకరణ జర గాలి. మా వాటా మాకు దక్కాలి. అన్ని పార్టీలు  వర్గీకరణ అంశాన్ని  మేనిఫెస్టోలో పెడుతున్నాయి. అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. కానీ వర్గీకరణ జరగట్లేదు. కేంద్రం దగ్గర ఇవన్ని పెండింగ్​లో ఉన్నాయి. దళితుల్లో అన్ని కులాలకు న్యాయం జరగాలి. వర్గీకరణ డిమాండ్​ను పరిష్కరించాలి. ఎవరికి వ్యతిరేకం కాదు పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి” అని మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రధాని వస్తే మీ సమస్య పరిష్కారం అయినట్లే అని చాలా మంది తనతో అన్నారని ఎంతో సంతోషం అనిపించిందన్నారు. 

మోదీపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, జాతి ప్రయోజనాలు ముఖ్యమని వర్గీకరణకు కృషి చేయాలన్నారు. మాది గ ఉపకులాల బహిరంగ సభకు, తమ ఆవేదన వినడానికి ప్రధాని రావడం అదృష్టంగా భావించాలన్నారు. మాదిగలను రాష్ట్రంలో  కేసీఆర్ అణగదొక్కారని, కేబినెట్​లో ఒక్క మంత్రి కూడా మాదిగ లేరని మందకృష్ణ విమర్శించారు. కర్నాటకలో మాదిగల నుంచి కేంద్ర మంత్రి నారాయణ స్వామి ఉన్నారని, తమిళనాడులో ఓడిపోయిన మురుగన్​ను మోదీ కేంద్ర మంత్రి చేశారని గుర్తుచేశారు. 

చరిత్రలో నిలిచిపోయే రోజు : కేంద్ర మంత్రి మురుగన్

మాదిగల విశ్వరూప మహాసభకు ప్రధాని హాజరు కావటం గౌరవంగా భావించాలని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని కొనియాడారు. దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత, గిరిజన మహిళను రాష్ర్టపతి చేసిన ఘనత బీజేపీదే అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్​లో ఎస్సీలు12 మంది, ఎస్టీలకు10 మంది, ఓబీసీలు 27 మంది ఉన్నారని, ఇది అసలైన సామాజిక న్యాయమని మురుగన్ అన్నారు.