న్యూఢిల్లీ: జమ్మూ రీజియన్‌లో 30 మందికి పైగా పాకిస్తాన్ టెర్రరిస్టులు యాక్టివ్‌గా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. శీతాకాల పరిస్థితుల కారణంగా దాక్కునేందుకు వాళ్లంతా ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్తున్నట్టు సమాచారం అందించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఆర్మీ అలర్ట్ అయింది. ఉగ్ర స్థావరాలను గుర్తించేందుకు అడవులు, కొండలు, లోయలను జల్లెడ పడుతున్నది. శీతాకాల పరిస్థితులను తట్టుకునే విధంగా స్పెషల్ ట్రైనింగ్ పొందిన వింటర్ వార్‌ఫేర్ సబ్ యూనిట్స్‌ను రంగంలోకి దించింది.
ఆ బలగాలకు అత్యాధునిక టెక్నాలజీ పరికరాలను అందజేసింది. డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, సెన్సార్లు, రాడార్స్‌తో టెర్రరిస్టుల కదలికలపై నిఘా పెట్టింది. సాధారణంగా శీతాకాలంలో జమ్మూకాశ్మీర్‌లో విపరీతమైన మంచు కురుస్తుంది. జమ్మూ రీజియన్‌లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుతుంది. ఈ పరిస్థితిలో ఆర్మీ కొద్దిమేర నిఘా కార్యకలాపాలను తగ్గిస్తుంటుంది. ఇదే అదనుగా భావించి టెర్రరిస్టులు చొరబాట్లకు పాల్పడుతుంటారు. అయితే, ఈసారి నిఘా వర్గాల హెచ్చరికలతో ఆర్మీ అప్రమత్తమైంది. ప్రతికూల వాతావరణంలోనూ నిఘా కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసింది.
