అది కాంగ్రెస్ గెలుపు కాదు..బీఆర్ఎస్ ఓటమి : కిషన్రెడ్డి

అది కాంగ్రెస్ గెలుపు కాదు..బీఆర్ఎస్ ఓటమి : కిషన్రెడ్డి

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కేసీఆర్ మీద ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వాస్తవానికి ఇది బీఆర్ ఎస్ ఓటమి తప్పా కాంగ్రెస్ గెలుపు కాదని చెప్పారు. బీఆర్ ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదన్నారు.  

ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గ్రామ గ్రామాన తిరుగుతూ BRS ఎమ్యేల్యేల మీద ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విచారణ చేస్తాం అని చెప్పారు.. ఇప్పుడు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ విచారణ చేస్తుందని తాను అనుకోవడం లేదని సందేహం వ్యక్తం చేశారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎక్కడికి వెళ్లినా.. మోదీ మోదీ అని  అంటున్నారని.. అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచే గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం గ్రామ స్థాయి నుంచి యువత , రైతులు, రైతు కూలీలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ తో పని లేదు.. రాబోయే రోజుల్లో బీఆర్ ఎస్ కు ఓటు వేయాల్సిన అవసరం లేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.