కేసీఆర్‌‌‌‌.. ప్రగతి భవన్‌‌లో ఉండేది 90 రోజులే : కిషన్‌‌ రెడ్డి

కేసీఆర్‌‌‌‌.. ప్రగతి భవన్‌‌లో ఉండేది 90 రోజులే : కిషన్‌‌ రెడ్డి
  • కేసీఆర్‌‌‌‌.. ప్రగతి భవన్‌‌లో ఉండేది 90 రోజులే
  • సీఎం‌‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: కిషన్‌‌ రెడ్డి
  • ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీపై విమర్శలు
  • కుటుంబం ప్రగతికే.. ప్రగతి భవన్ అని విమర్శ 
  • బీజేపీలో చేరిన మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణయాదవ్​

హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్‌‌‌‌కు కౌంట్ డౌన్ మొదలైందని, ఆయన ప్రగతి భవన్‌‌లో ఉండేది కేవలం 90 రోజులేనని, ఆ తర్వాత శాశ్వతంగా ఫామ్ హౌస్‌‌లోనే ఉండబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్.. కల్వకుంట్ల కుటుంబ ప్రగతి కోసమే తప్ప.. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కాదని మండిపడ్డారు. శనివారం కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్, సిర్పూర్ జడ్పీటీసీ రేఖ సత్యనారాయణతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కిషన్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోపిడీ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో.. ఇది తెలంగాణ ప్రజల నినాదంగా మారిందన్నారు. అవినీతి, అహంకారానికి, నియంతృత్వానికి, ప్రతిపక్షాల నిర్భంధాలకు, అరాచక పాలనకు, ప్రజాస్వామ్య అణచివేతకు, అసమర్థ విధానాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కిషన్‌‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుండగా.. వీటికి హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు సీఎం తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు అధికార పార్టీకి, కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. 

పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చో..

రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలి గానీ, ప్రధాని మోదీపై అర్థంలేని విమర్శలు చేయొద్దని కేసీఆర్‌‌‌‌ను కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు.- అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆ భయంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  

కాంగ్రెస్‌‌కు ఓటేస్తే బీఆర్‌‌‌‌ఎస్‌‌కు వేసినట్టే..

కాంగ్రెస్‌‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్‌‌కు వేసినట్లేనని కిషన్‌‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్లు కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయి బీఆర్ఎస్‌‌లో చేరతారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ పార్టీ 6 గ్యారంటీలు కాదు.. 60 గ్యారంటీలు ఇచ్చినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.

నేడు గంట సేపు స్వచ్ఛ భారత్‌‌లో పాల్గొనండి.. 

ప్రధాని మోదీ ఈ నెల1న మహబూబ్‌‌నగర్, 3న నిజామాబాద్‌‌కు వస్తున్నారని కిషన్‌‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.20 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు మోదీ అంకితం చేయనున్నారని చెప్పారు. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజాగర్జన సభ, ఇందూరు జన గర్జన సభలను విజయవంతం చేయాలని ప్రజలను, పార్టీ క్యాడర్‌‌‌‌ను కోరారు. గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అక్టోబర్‌‌‌‌ 1న ఉదయం 9 నుంచి 10 వరకు దేశంలోని ప్రతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రతి కాలనీ, బస్తీల్లోని ప్రజలంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.