రాష్ట్రంలో ఎన్నికలు డిసెంబర్‌‌‌‌లోనే జరుగుతయ్: కిషన్ రెడ్డి​

రాష్ట్రంలో ఎన్నికలు  డిసెంబర్‌‌‌‌లోనే జరుగుతయ్: కిషన్ రెడ్డి​
  • మేం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నం
  • ఇతర పార్టీలను మభ్యపెట్టేందుకే కేటీఆర్ వ్యాఖ్యలు
  • సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా కాదు.. విమోచన దినంగా జరపాలి
  • రాష్ట్రపతి భవన్‌‌లో ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు గర్వకారణమని కామెంట్

హైదరాబాద్/ఎల్ బీనగర్, వెలుగు: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. డిసెంబర్‌‌‌‌లోనే అసెంబ్లీ ఎలక్షన్లు ఉంటాయని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తాము సిద్ధమవుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు జరుగుతాయంటూ.. ప్రజలను, ఇతర పార్టీలను మభ్యపెట్టేందుకే కేటీఆర్ ప్రకటనలు చేస్తున్నారన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో, వనస్థలిపురంలోని ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌లో జరిగిన ఎస్సీ మోర్చా మీటింగ్‌‌ తర్వాత మీడియా ప్రతినిధులతో కిషన్​రెడ్డి మాట్లాడారు. సెప్టెంబర్ 17 చరిత్రను కనుమరుగు చేసేలా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు గతంలో కుట్రలు చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదని, ఎంఐఎంకు లొంగిపోయి, తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని కేసీఆర్‌‌‌‌పై మండిపడ్డారు. ‘‘ఇవ్వాళ ఎంఐఎంకు కేసీఆర్ దాసోహమైపోయారు. కారు స్టీరింగ్, ఎక్సలేటర్, బ్రేక్ లను ఎంఐఎం చేతిలో పెట్టి వాళ్ల మోచేతి నీళ్లు తాగుతూ.. ఆ పార్టీ కనుసైగల్లో కేసీఆర్ పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 17 చరిత్రను ఈ తరానికి అందించకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తే.. నేడు కేసీఆర్ ఎంఐఎంకు లొంగిపోయి విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌‌‌‌కు ఉలికిపాటు ఎందుకు?

అమృత్ ఉత్సవాల ముగింపు ప్రోగ్రామ్‌‌లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్​లో ఈ ఏడాదీ  తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని కిషన్‌‌రెడ్డి వెల్లడించారు. విమోచన దినోత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంటే.. కేసీఆర్‌‌‌‌కు ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. 


‘‘సెప్టెంబర్ 17న సమైక్యత దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ ఎలా ప్రకటిస్తారు? వేలాది మంది యువకులు, మహిళలు పెద్దఎత్తున నిజాంపై పోరాడారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించి వారిని అవమానపరుస్తారా? 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. సెప్టెంబర్ 17ను సమైక్యతా దినమని ఏ పుస్తకం చెబుతుందో సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. కర్నాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ‘హైదరాబాద్ ముక్తీ దివస్’ పేరుతో సెప్టెంబర్ 17 ఉత్సవాలు నిర్వహించగా.. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కేవలం ఎంఐఎంకు లొంగిపోయే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ ఉత్సవాలను నిర్వహించలేదని విమర్శించారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్ అయితే.. రెండో ద్రోహి బీఆర్ఎస్ అని నిప్పులు చెరిగారు. మజ్లిస్, బీఆర్ఎస్ లు విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేసేలా కుట్ర చేసి.. సమైక్యత దినోత్సవం అంటూ కొత్త రాగం అందుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌‌‌‌కు దమ్ము, ధైర్యం ఉంటే విమోచన పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని, చేతగాకుంటే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు.

విమోచన ఉత్సవాలను ప్రతి గ్రామంలో నిర్వహించాలి

‘‘విమోచన ఉత్సవాలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని తెలంగాణలోని అందరు సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నాను. రాష్ట్రపతి నిలయానికి, హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు అవినాభావ సంబంధం ఉంది. సెప్టెంబర్‌‌‌‌ 17కు రాష్ట్రపతి భవన్ సజీవ సాక్ష్యం. అందుకే తొలిసారిగా ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌‌లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం” అని కిషన్‌‌రెడ్డి చెప్పారు. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే విమోచన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై.. పారా మిలటరీ దళాల కవాతును స్వీకరిస్తారని తెలిపారు. తర్వాత అక్కడే ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తారని చెప్పారు. అందుకే దీనికి అన్ని పార్టీల నేతలు హాజరుకావాలని కోరుతున్నానని చెప్పారు. ‘‘గ్రౌండ్ ఇవ్వలేదని మూర్ఖత్వంతో కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. విమోచన ఉత్సవాల నిర్వహణ అనేది మా పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ గుర్తుంచుకోవాలి. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఈ ఏడాది కూడా ఆహ్వానిస్తున్నాం. గత ఏడాది ఒవైసీ అనుమతి ఇవ్వనందున కేసీఆర్ హాజరుకాలేదు. మరి ఈసారి ఒవైసీ అనుమతి ఇస్తారో లేదో చూడాలి” అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అన్యాయం

‘‘తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తర్వాత దాన్ని తుంగలో తొక్కారు. ఇది దళితులకు కేసీఆర్ చేసిన మొట్టమొదటి మోసం. మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మరోసారి దళితులను మోసం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ జాడ లేదు. దళిత బంధు పేరుతో సబ్ ప్లాన్ ను బంద్ చేశారు. కేసీఆర్ తీరును చూస్తుంటే వంద ఏండ్లు అయినా దళితబంధు పూర్తి స్థాయిలో రాదు. వివక్షకు గురైన సామాజిక వర్గాన్ని ఆయన మోసం చేస్తున్నారు” అని కిషన్‌‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీ కార్పొరేషన్ మూతపడిందని అన్నారు. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని, ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిస్తున్న కేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్ షిప్ లను అడ్డుకుంటున్న వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, రైతు బంధు భూస్వాములకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కౌలు రైతుకు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ మళ్లీ వస్తే పేదలకు ఒక్క సంక్షేమ పథకం కూడా దక్కదని కిషన్ రెడ్డి అన్నారు.

ఇయ్యాల ఇందిరాపార్కు వద్ద బీజేపీ దీక్ష

నిరుద్యోగులపై బీఆర్ఎస్ సర్కార్ అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ బుధవారం ఇందిరా పార్కు వద్ద బీజేపీ 24 గంటల దీక్షకు  సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీక్ష గురువారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ,  బండి సంజయ్ తోపాటు పార్టీకి  చెందిన రాష్ట్ర ముఖ్య నేతలంతా పాల్గొనున్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు హాజరయ్యేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. దీన్ని విజయవంతం చేసి రాష్ట్రంలోని నిరుద్యోగులను కేసీఆర్ చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.