కేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నరు : కిషన్ రెడ్డి

కేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నరు : కిషన్ రెడ్డి

తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్​ బరితెగించి అధికార దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మర్రిశశిధర్​రెడ్డి బీజేపీ పార్టీలోకి చేరిన అనంతరం మాట్లాడిన ఆయన.. మర్రి బీజేపీలోకి రావడం తెలంగాణలో.. పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు. శశిధర్ రెడ్డితో కలిసి తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. 

కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు దిక్కు అనేలా పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. తన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్​ దృష్టి పెట్టారన్నారు. అందుకే బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కల్వకుంట్ల కుటుంబం  బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్​ పార్టీ దుందుడుకు విధానాలతో తన గోతిని తానే తవ్వుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలని.. ఆ సమయంలో మార్పు సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.