- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎంకు ఆయన లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్ల విస్తరణ, భూ సేకసరణ పనులు వెంటనే చేపట్టాలని లేఖలో కోరారు. ప్రధానంగా చర్లపల్లి స్టేషన్ అవసరాల దృష్ట్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) గోడౌన్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, భరత్ నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్ కు వచ్చే రహదారిని కనీసం 100 అడుగుల వెడల్పుకు విస్తరించాలని కోరారు. అలాగే, ఈసీ నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్ లోని ఎంఎంటీఎస్ ప్లాట్ ఫాం రూట్ ను కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవు విస్తరణ చేపట్టాలన్నారు. చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు మూడెకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్ ఫాం వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉందన్నారు.
వీటితో పాటుగా భవిష్యత్ రద్దీని దృష్టిలో పెట్టుకొని రూ. 715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పునరాభివృద్ధి చేస్తున్నట్టు గుర్తుచేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్ ను చేరుకొనే ఆల్ఫా హోటల్ నుంచి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలన్నారు. ఈ విషయాలన్నింటి రైల్వే శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి నివేదించడం జరిగిందని లేఖలో ప్రస్తావించారు.
ఈ అంశాలపై 2022లో ఆనాటి సీఎంకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 2024 లో ప్రస్తుత ప్రభుత్వానికి సైతం లేఖ రాసినట్టు తెలిపారు. అందువల్ల ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ చూపి.. చర్లపల్లి రైల్వేస్టేషన్ కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం అవసరమైన భూమి కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు అన్ని రకాల సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.

