- కాంగ్రెస్ సర్కార్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ -మర్రి చెన్నారెడ్డి హ్యుమన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన దిశా సమావేశం అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దన్నారు.
మూసీ పునరుద్ధరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేద ప్రజలకు అన్యాయం జరిగితే వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? కాంగ్రెస్ హయాంలో సర్ ప్రక్రియ చేయలేదా? ఇప్పుడెందుకు కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన మీద కాంగ్రెస్ నాయకులు సలహాలు, సూచనలు కమిటీకి ఇవ్వాలని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు.
కానీ కాంగ్రెస్ చేస్తే ఒప్పు, బీజేపీ చేస్తే తప్పు అనేలా ప్రవర్తించవద్దన్నారు. జీఎస్టీ తెస్తే తప్పుడు ప్రచారం చేశారని, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకువస్తే మోదీ వ్యాక్సిన్ అని విమర్శించారని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఓడిపోయిందని కాంగ్రెస్ అనడం శోచనీయమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడిగి సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఆ పార్టీ నాయకులు మాట్లాడటం సరికాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు, గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు.
