
తిరుమల : ప్రపంచంలో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని, చైనా, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగించాలని, తిరుమల వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. శనివారం ఆయన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆరోగ్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి.. వేంకటేశ్వర స్వామివారు ప్రజలందరికీ ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలన్నారు.