రెగ్యులర్ వంటకాల్లా కనిపించినా కొన్ని వంటకాల రూటే సెపరేటు. వాటిని ఎప్పుడు తిన్నా భలేగున్నయ్ అనకమానరు తిన్నవాళ్లు, వీటికి సీజన్ తో సంబంధంలేదు. ఎప్పుడు చేసుకుని తిన్నా సూపర్ బాసూ అనాల్సిందే.
కారం పెసరపప్పు పచ్చిపులుసు తయారీకి కావాల్సినవి
- పెసరపప్పు: ఒక కప్పు
- ఆవాలు: ఒక టీ స్పూన్
- జీలకర్ర: ఒక టీస్పూన్
- ఎండుమిర్చి: రెండు
- కరివేపాకు: రెండురెమ్మలు
- ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు
- వెల్లుల్లి: ఐదు రెబ్బలు
- పసుపు: పావు టీ స్పూన్
- చింతపండు: 50 గ్రా.
- నువ్వుల పిండి: రెండు టీ స్పూన్లు
- పచ్చిమిర్చి: రెండు (మంటపై కాల్చినవి)
- బెల్లం పొడి: రెండు టీ స్పూన్లు
- ఉప్పు: తగినంత
- కారం: తగినంత
- నూనె: తగినంత
- కొత్తిమీర: ఒక టేబుల్ స్పూన్
కారం పెసరపప్పు పచ్చిపులుసు తయారీ విధానం
పెసరపప్పు కడిగి పక్కన పెట్టాలి. చింతపండు అరగంట ముందు నానబెట్టి ఉంచాలి. స్టవ్ పై గిన్నె పెట్టి నూనె వేసి వేడిచెయ్యాలి. వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేసి వేగించాలి.
అవి వేగాక పెసరపప్పు వేసి నీళ్లు పోసి మూత పెట్టాలి. పదినిమిషాలు ఉడికాక ఉప్పు, కారం వేసి ఉడికిస్తే 'కారం పెసర పప్పు' రెడీ .ఒక గిన్నెలో చింతపండు పిసికి నీళ్లు వడగట్టి గుజ్జు తీసేయాలి. ఆ చింతపండు పులుసులో కాల్చిన పచ్చిమిర్చి వేసి మెదపాలి.
తర్వాత నువ్వుల పొడి, పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పై పాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టి పులుసులో వేసి వెంటనే మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే 'పచ్చిపులుసు' రెడీ. కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే భలే మజా!
సర్వ-పిండి (తపాల చెక్క) తయారీకి కావాల్సినవి
- బియ్యప్పిండి: ఒక కప్పు
- శెనగపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- నువ్వులు:రెండు టేబుల్ స్పూన్లు
- పల్లీలు: రెండు టేబుల్ స్పూన్లు
- కారం: రెండు టేబుల్ స్పూన్లు
- కరివేపాకు: రెండు రెమ్మలు
- పచ్చిమిర్చి: రెండు
- పుదీనా: తరుగు
- ఉప్పు తగినంత
- నూనె: తగినంత
సర్వ-పిండి (తపాల చెక్క) తయారీ విధానం
శెనగపప్పు గంట ముందుగా నానబెట్టాలి. శెనగపప్పు,పచ్చిమిర్చి, నువ్వులు, కారం, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి తీసుకుని దానికి మిక్సీ పట్టిన మిశ్రమం, కారం, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ ముద్దగా చెయ్యాలి. ఒక బాండీలో నూనెవేసి బాండీ మొత్తం పరచాలి.
తర్వాత ఆ పిండి ముద్దను గిన్నె అంచుల వరకూ ఒత్తి, చిన్న చిన్న గుంతలు చేసి వాటిలో నూనె పోసి స్టవ్ పెట్టి సన్నని మంటతో వేడి చెయ్యాలి.
అలా ఓ పదిహేను నిమిషాలు మూత పెట్టి వేడి చేస్తే 'సర్వపిండి' రెడీ. దీన్ని వెన్నతో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. పిల్లలు ఎంతోఇష్టంగా తింటారు.
బొక్కల షేర్వా తయారీకి కావాల్సినవి
- మూలగ బొక్కలు: అరకిలో
- ఉల్లి తురుము: ఒక కప్పు
- లవంగాలు: మూడు.
- యాలకులు: మూడు
- దాల్చిన చెక్క: మూడు
- జీలకర్ర: ఒక టీ స్పూన్
- షాజీరా : ఒక టీ స్పూన్
- పసుపు: పావు టీ స్పూన్
- మెంతి కూర తరుగు: ఒక కప్పు
- టొమాటో ముక్కలు: అర కప్పు
- దోసకాయ ముక్కలు: ఒక కప్పు
- పుదీనా తరుగు: అర కప్పు
- కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
- కారం: తగినంత
- ఉప్పు: తగినంత
- నూనె: తగినంత
బొక్కల షేర్వా తయారీ విధానం
బొక్కలు శుభ్రం చేసి కుక్కర్ లో వేసి నీళ్లు పోసి సన్నని మంట పై నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. తర్వాత ఒక గిన్నె స్టవ్ పై పెట్టి నూనె పోసి వేడి చేసి జీలకర్ర, లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క వేసి వేగించాలి.
అవి వేగాక దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు చేసి వేగించి, మెంతికూర, పుదీనా తరుగు వెయ్యాలి. తర్వాత పసుపు ఉప్పు, కారం వేసి ఉడికించాలి.
అవి బాగా ఉడికాక కుక్కర్ లో బొక్కలను ఆ మిశ్రమంలో వేసి ఉడికించాలి. పదినిముషాల తర్వాత కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు ఉడికిస్తే ఘుమఘుమలాడే ' బొక్కల షేర్వా రెడీ..
