
హైదరాబాద్ లో మరో చిట్ ఫండ్ సంస్థ మోసానికి పాల్పడింది. పెద్ద మొత్తంలో చిట్టీల రూపంలో కోట్ల రూపాయల వసూలు చేయడంతో బాధితులు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తన భార్య షణ్ముఖి, స్నేహితుడు వెంకట రమణారావులతో కలిసి కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ లో పదిహేను సంవత్సరాల క్రితం కేకేఆర్ చిట్ ఫండ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసాడు. అప్పటి నుండి అనేక మంది ఆ కంపెనీలో చిట్టీల రూపంలో డబ్బులు జమ చేసే వారు. మొదట చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో జమా చేసిన ఖాతాదారులు, కిరణ్ కుమార్ రెడ్డి పై నమ్మకం కలగటంతో 300 పై చిలుకు మంది పెద్దమొత్తంలో(రూ.10 కోట్లు) జమ చేసారు.
కాగా కిరణ్ కుమార్ రెడ్డి గత నెల నుండి కార్యాలయం తెరువక పోవటం, అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్ర్రయించారు. కూతురు పెళ్ళి కోసం దాచుకున్న డబ్బులు, ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న డబ్బులను తీసుకుని కిరణ్ కుమార్ ఊడాయించటంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే తమకు దిక్కని ఆవేదన వ్యక్తం చేసారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డైరెక్టర్లు ముగ్గురూ పరారీలో ఉన్నారని తెలిపారు