- కల్మా పఠించాలని వేధింపులు.. నిరాకరించడంతో అటాక్
ముంబై: మతం అడిగి మరీ ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. సోమవారం ముంబైలోని నయా నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి జైబ్ జుబేర్ అన్సారీ (31)అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితుడైన జైబ్ జుబేర్ అన్సారీ సోమవారం తెల్లవారుజామున మీరా రోడ్‌లోని ఒక నిర్మాణ స్థలానికి వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీగార్డులుగా పని చేస్తున్న రాజ్ కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్ వద్దకు వెళ్లి వారి మతం అడిగాడు.
హిందువులు కాకపోతే ఇస్లాం మతానికి చెందిన కల్మాను చదవాలని వేధించాడు. అందుకు వారు నిరాకరించడంతో ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాజ్ కుమార్ మిశ్రా తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రాణాలతో బయటపడి హాస్పిటల్‌కు చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుబ్రతో సేన్‌ను నయాబ్ షేక్ అనే వ్యక్తి రక్షించి వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. ప్రస్తుతం వీరిద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఘటన జరిగిన 90 నిమిషాల్లోనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు. హత్యాయత్నం, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని థానే కోర్టులో హాజరుపర్చగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించారు. కాగా, ఈ దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు, స్టేట్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ విచారణ చేపట్టాయి. నిందితుడు అన్సారీ 2000 నుంచి 2020 వరకు తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివసించాడు. వర్క్ పర్మిట్ ముగియడంతో 2020లో తిరిగి భారత్‌కు వచ్చాడు.

