నేపాల్‌‌లో విచిత్ర ఘటన.. కొట్లాటకు పోయి.. కత్తిని కడుపులో పెట్టుకొచ్చిండు

నేపాల్‌‌లో విచిత్ర ఘటన.. కొట్లాటకు పోయి.. కత్తిని కడుపులో పెట్టుకొచ్చిండు

ఖాట్మండు: కొట్లాటకు వెళ్లిన ఓ యువకుడు కత్తిని కడుపులో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి తన కడుపులోకి ఎప్పుడు, ఎలా వెళ్లిందో కూడా అతడికి తెలియకపోవడం అసలు  ముచ్చట. నేపాల్‌‌లో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన గ్రూప్‌‌ తగాదాల్లో 22 ఏండ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గొడవలో అపోజిషన్‌‌ వాళ్లు అతనిపై దాడి చేయడంతో పొత్తి కడుపుపై కత్తి గాటు పడింది. వెంటనే అతను స్థానిక హాస్పిటల్‌‌కు వెళ్లగా, అక్కడి డాక్టర్లు అతన్ని పరీక్షించి కుట్లు వేసి, ఇంటికి పంపించారు. కుట్లు వేసేటప్పుడు అతని కడుపులో కత్తి ఉందన్న సంగతి డాక్టర్లకు, ఆ యువకుడికి కూడా తెలియదు. అది నార్మల్‌‌ కత్తి గాటు మాత్రమే అనుకొని, కుట్లు వేశారు.

ఘటన జరిగినప్పుడు అతను మద్యం మత్తులో ఉండటంతో ఏం జరిగిందో ఆ యువకుడికి గుర్తులేదు. మరుసటి రోజు అతనికి కడుపులో చాలా తీవ్రంగా నొప్పి ఉండటంతో హాస్పిటల్‌‌కు వెళ్లాడు. డాక్టర్లు ఎక్స్ రే తీయించారు.   అతడి కడుపులో  దాదాపు 15 సెంటీమీటర్ల కత్తి ఉన్నట్లు ఎక్స్ రే ఫిల్మ్ లో చూసి షాకయ్యారు. ఆ తర్వాత యువకుడిని డాక్టర్లు ఆరా తీయడంతో అతడు అపొజిట్ గ్యాంగ్ తో తన కొట్లాట గురించి, కత్తి గాటు గురించి చెప్పడంతో అసలు విషయం గుర్తించారు. వెంటనే డాక్టర్లు సర్జరీ చేసి, కత్తిని బయటకు తీశారు. అయితే, రోజంతా కత్తి కడుపులోనే ఉన్నా.. ఇతర అవయవాలకు మాత్రం ఏమీ కాలేదని డాక్టర్లు వెల్లడించారు. త్వరలో అతను పూర్తిగా రికవరీ అవుతాడని చెప్పారు.