కోల్​కతా డాక్టర్ కేసు.. ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

కోల్​కతా డాక్టర్ కేసు.. ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?

కోల్​కతా: ఆర్జీ కర్ దవాఖానలో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్​తో పనిచేసిన​ నలుగురు సహచరుల వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో వారికి లై డిటెక్టర్​ పరీక్షలు చేయాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో ఇద్దరు పీజీ ఫస్ట్​ ఇయిర్​ స్టూడెంట్స్​ కాగా, మరొక హౌస్​ సర్జన్, ఇంటర్న్​ ఉన్నారు.  ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని సీబీఐ దర్యాప్తులో తేల్చింది. డాక్టర్​ డెడ్​బాడీ గుర్తించిన సెమినార్ ​హాల్​లో ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరి వేలిముద్రలున్నాయి. ఆ రోజు రాత్రి హౌస్​ సర్జన్​ ఫస్ట్​ఫ్లోర్​ నుంచి థర్డ్​ఫ్లోర్​కు వెళ్లినట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. 

రాత్రి 2.45 గంటలకు మూడో అంతస్తుకు వెళ్లినట్టు హౌస్ సర్జన్ తెలిపారు. ఇంటర్న్ మూడో అంతస్తులో ఉన్నారని, ఆ రాత్రి బాధితురాలితో మాట్లాడారని సీబీఐ గుర్తించింది. అలాగే, బాధితురాలితో ఇద్దరు పోస్ట్​గ్రాడ్యుయేట్​ ఫస్ట్​ ఇయర్​ ట్రెయినీలు కలిసి డిన్నర్​ చేశారు. అనంతరం వారు సెమినార్​ రూమ్​కు వెళ్లి.. ఒలింపిక్స్​లో నీరజ్​ చోప్రా జావెలిన్​త్రో ఈవెంట్​ను టీవీలో వీక్షించారు. 2 గంటల ప్రాంతంలో బాధితురాలు సెమినార్​ రూంలోనే ఉండగా.. ఆ ఇద్దరు పక్కనే ఉన్న స్లీప్​రూంలోకి వెళ్లిపోయారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరు ట్రెయినీ డాక్టర్లలో ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అతడు మిగతా సహచరులకు, సీనియర్​ డాక్టర్లకు సమాచారాన్ని చేరవేశాడు. ఇదిలా ఉండగా, సెమినార్‌‌ హాల్‌‌ డోర్‌‌ బోల్ట్‌‌ పని చేయడంలేదని తమ విచారణలో బయటపడినట్టు సీబీఐ పేర్కొన్నది. బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్‌‌ హాల్‌‌ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై దర్యాప్తు సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఆర్జీ కర్ మాజీ​ ప్రిన్సిపాల్​పై అవినీతి కేసు సీబీఐకి..

ఆర్జీ కర్​ వైద్య కళాశాల, హాస్పిటల్​లో  మాజీ ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ అవినీతి కేసును సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం (సిట్​) విచారిస్తున్నది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందించాలని హైకోర్టు పేర్కొంది.  దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా  నివేదికను సమర్పించాలని సీబీఐని జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఆదేశించారు. కాగా, ఆర్జీ కర్​ మాజీ ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం మమతా బెనర్జీ గతంలో రాసిన ఓ లేఖ వైరల్​గా మారింది.  ఈ లెటర్​ను బట్టి సందీప్​ ఘోష్​కు తృణమూల్​కాంగ్రెస్​, సీఎం మమతతో దగ్గరి సంబంధాలున్నాయని తేలిపోయిందని బీజేపీ ఆరోపించింది.

నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ

వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్​ రాయ్​కి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. శుక్రవారంతో సీబీఐ కస్టడీ ముగియగా.. సంజయ్​ను భారీ భద్రత నడుమ పోలీసులు సీల్దా సివిల్​ అండ్​ క్రిమినల్​ కోర్టుకు తరలించారు. కాగా, కోర్టు జ్యుడీషియల్‌‌ కస్టడీ విధించడంతో.. పోలీసులు అతడిని జైలుకు తరలించారు.సంజయ్​కి పాలిగ్రాఫ్‌‌ టెస్ట్​ నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరుచేసింది.