ప్రజలకు న్యాయం జరుగుతుందనే రాజీనామా 

ప్రజలకు న్యాయం జరుగుతుందనే రాజీనామా 

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే తాను ఈ పోరాటం చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమ్ముడుపోవడం తన రక్తంలో లేదన్న ఆయన. నీచ రాజకీయాలు స్వార్థం కోసం కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని వాపోయారు. 

కాంగ్రెస్ కేసీఆర్ను ఢీకొట్టలేదు
అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నష్టపోయిందని రాజగోపాల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా హైకమాండ్ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ,  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు అభిమానం ఉందని, అయితే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా పిలిచి మాట్లాడకపోవడం బాధించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా విమర్శలు చేయనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో కొనసాగమని అంటున్నారని, అయితే కేసీఆర్ ను ఢీకొట్టడం ఆ పార్టీ వల్ల కాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటామంటున్న నేతలు తాను చేసిన తప్పేంటో చెప్పాలని నిలదీశారు. 

సోనియాను తిట్టినోళ్ల కింద పనిచేయాలా?
ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడి కింద పని చేయడం తన వల్ల కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎవరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరి వశమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఆత్మగౌరవం లేకుంటే ప్రజల కోసం ఎట్ల పనిచేస్తామని ఆవేదనవ్యక్తం చేశారు. పదవులు త్యాగం చేసింది తామైతే.. ఇప్పుడు తామే స్వరాష్ట్రం తీసుకొచ్చినట్లు కొందరు మాట్లాడుతున్నారని రాజగోపాల్ ఆరోపించారు. 20 ఏండ్లు సోనియాను తిట్టినోళ్ల కింద పనిచేయాలా, అలాంటి వారికి సీఎం పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక ఏర్పాటు చేసిన కమిటీల్లో తమ నిర్ణయాలు తీసుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కొందరు వ్యక్తులు మూర్ఖుల్లా వ్యవహరించి పార్టీని ఆగం చేసిన్రని విమర్శించారు.  స్వార్థం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ స్పష్టం చేశారు. టైం తీసుకుని స్పీకర్ కు రాజీనామా లేఖ అందజేస్తానని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినందున పార్టీతో పాటు పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు.  

బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకోలేదు
మోడీ పాలన గురించి మూడేళ్ళుగా ఆలోచించినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కేంద్రంలో మూడోసారి కూడా మోడీ సర్కార్ అధికారంలోకి వస్తదని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పందించిన ఆయన.. ఏ పార్టీలో ఉంటే ప్రజలకు బాగుంటుందో అదే పార్టీలో చేరతానని అన్నారు. తన నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. బీజేపీలో చేరే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అయితే రాష్ట్రంలో అరాచకపాలన పోవాలంటే మోడీ, అమిత్ షా వల్లే సాధ్యమవుతుందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. మునుగోడు ప్రజలే గెలుపోటములు డిసైడ్ చేస్తారని, త్వరలోనే తన భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేదన్న ఆయన.. చత్తీస్ ఘడ్ టెండర్ 2022 మార్చిలోనే వచ్చిందని అన్నారు.