బండి సంజయ్ను అలా చూసి.. బాత్రూంకి వెళ్లి ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం

బండి సంజయ్ను అలా చూసి.. బాత్రూంకి వెళ్లి ఏడ్చా : రాజగోపాల్ రెడ్డి భావోద్వేగం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి సభలో.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 2023, జులై 21వ తేదీ హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో.. ఆయన్ను చూసి కన్నీళ్లు వచ్చాయని.. బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.

బండి సంబయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూనే.. ఆయన వల్లే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారాయన. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు సంజయ్ నాయకత్వంలోనే జరిగాయని గుర్తు చేశారాయన. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలో చేరానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని.. కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానంటూ వివరణ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పని చేసి.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారాయన. 

బండి సంజయ్ పాదయాత్ర వల్లే పార్టీ బలపడిందని..యువతలో జోష్ నింపిందని.. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అన్నారాయన. బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని ప్రచారం చేస్తున్నారని.. ఎప్పటికీ అలా జరగదన్నారు రాజగోపాల్ రెడ్డి. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో.. బండి సంజయ్ గురించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.