రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలంటే.. మోడీ, అమిత్​షాతోనే సాధ్యం

రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలంటే.. మోడీ, అమిత్​షాతోనే సాధ్యం
  • రాజ​గోపాల్ రాజీనామా
  • టీఆర్ఎస్ అరాచక పాలన అంతానికే ఈ నిర్ణయమని ప్రకటన
  • బయటి నుంచి కాంగ్రెస్‌‌లోకి వచ్చినోళ్లను సీఎం చేయాల్నా?
  • గెలుపోటములను మునుగోడు ప్రజలే తేలుస్తరని వెళ్లడి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. త్వరలో స్పీకర్‌‌‌‌ను కలిసి తన రిజైన్ లెటర్‌‌‌‌ను అందజేస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్ అరాచక, కుటుంబ పాలనను అంతమొందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసేందుకు 10 రోజులు ఆగుదామనుకున్నానని, కానీ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. “చాలా మంది ‘కొనసాగవచ్చు’ అన్నరు. నేను ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన వాడిని.. ఇకపై కొనసాగలేను. అందరినీ కలవకపోయినా.. కొందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నా. నా నిర్ణయం వల్ల బాధ పడితే క్షమించండి.. నేను కరెక్ట్​ అనుకుంటే నాతో రండి.. లేదనుకుంటే మీకు నచ్చినట్లు చేయండి. నా రాజీనామాతో ఈ సీఎంకు కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించాలని చెబుతున్నా” అని అన్నారు. తన అన్న వెంకట్​రెడ్డి ఆయన సొంత అభిప్రాయం మేరకు నడుచుకుంటారని, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి అని చెప్పారు.
“తెలంగాణ భవిష్యత్తు ఏ పార్టీలో బాగుంటే దాంట్లో చేరుతా. ప్రజలు కోరుకుంటే మళ్లీ పోటీ చేస్తా. బీజేపీలో చేరడం ఏ రోజు అన్నది ఇంకా నేను నిర్ణయం తీసుకోలేదు” అని రాజగోపాల్‌‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే.. మోడీ, అమిత్​షాలతోనే సాధ్యమని చెప్పారు. గెలుపోటములను మునుగోడు ప్రజలు నిర్ణయిస్తరన్నారు. మునుగోడు ప్రజల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. “మోడీ ప్రభుత్వం దూసుకుపోతున్నది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్లతో కలవాలని నిర్ణయించుకున్నా. అయినా నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు.. నా స్వార్థం కోసం కాదు.. కాంగ్రెస్‌‌కు రాజీనామా చేస్తున్నానని బాధతో చెబుతున్నా” అని అన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిండు
90 సీట్లతో క్లియర్ మెజారిటీ వచ్చినా 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నారని రాజగోపాల్ మండిపడ్డారు. “సీఎల్పీ నేతగా ఉన్న దళిత వ్యక్తి భట్టి విక్రమార్కను అసెంబ్లీలో చాలాసార్లు అవమానించారు. అప్పుడు చాలా బాధ అయింది. ఈ సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అపాయింట్‌‌మెంట్​ ఇవ్వకపోవడమేంటో అర్థం కాదు. రాష్ట్రంలో కుటుంబ పాలన ఒక్కటే ఉంది. సంక్షేమం లేదు. ప్రజాస్వామ్యం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలకు గౌరవం లేదు” అని అన్నారు. ‘‘రాష్ర్టంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దళితబంధు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిండు.  ఇంత దారుణ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు” అని మండిపడ్డారు. దళితబంధు అంతటా ఇచ్చి తన నియోజకవర్గంలో ఇవ్వలేదన్నారు. 1,400 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు ఒక కుటుంబం చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిపోయిందన్నారు. నియంత, రాచరిక పాలన సాగుతున్నదన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అక్కడ రోడ్లు, సీఎం ఫామ్‌‌హౌస్‌‌ రోడ్డు చూసి.. తమ దగ్గర రోడ్లు చూస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటమే బెటర్ అనిపించిందన్నారు.

మీ నుంచి పాఠాలు నేర్చుకోవాలా? 
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉందని, తనకెంత ఆవేదన ఉన్నా ఏమీ చేయలేకపోయానని రాజగోపాల్ అన్నారు. “కాంగ్రెస్ నా మీద యాక్షన్ తీసుకుంటుందని కొందరు అంటున్నరు. సోనియా, రాహుల్ అంటే నాకు గౌరవం.. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో బాధపడ్డా. 12 మంది పోయినా, పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలో అడగలేదు. కాంగ్రెస్‌‌ను విమర్శించను. నన్ను ఉండమన్నారు. నాకు పెద్ద పాత్ర లేదు. మీరు సరిగ్గా పోరాటం చేయడం లేదు కాబట్టి రాజీనామా నిర్ణయం తీసుకున్న. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటరు. కష్టకాలంలో ఎమ్మెల్సీ గెలిచా. కాంగ్రెస్‌‌పై విశ్వాసం ఉంది. కానీ 20 ఏండ్లు, కాంగ్రెస్, సోనియాను తిట్టిన వ్యక్తిని తెచ్చి ఆయన కింద పని చేయమంటారు. మాకు ఆత్మగౌరవం లేదా? ఈయన ఏమన్నా గెలిచిండా?  నామినేటెడ్​ పోస్టు కాదు మాది. ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశామో అదే లేదు అక్కడ. మా పార్టీలో మాకే గౌరవం లేదు. ఇతర పార్టీల నుంచి తెచ్చి మా మీద పెడ్తరు. వాళ్లేదో పొడిచినట్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లు మాట్లాడుతారు. ఒక నియోజకవర్గానికి పరిమితం కావాలా? మీరు పార్టీని అధికారంలోకి తెస్తారా? మీ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలా? మీరు తెలంగాణ కోసం పోరాటం చేశారా? ఐదారుసార్లు ఓడిపోయిన వాళ్లు చెబితే మేం వినాలా? సోనియాను తిట్టిన వాళ్ల మాటలు వినాలా? ఈ దరిద్రులంతా ఏందీ? పీసీసీగా రేవంత్ వచ్చినప్పుడు ఏమనలేదు. కమిటీలు వేసినప్పుడు కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడారా? కాంగ్రెస్‌‌ను మీరు కబ్జా చేసిండ్రా.. బయట నుంచి వచ్చినోళ్లను సీఎం చేయాలా? కాంగ్రెస్‌‌ను నాశనం చేశారు. కార్యకర్తలు రోడ్డున పడ్డరు. కేసులతో పోలీసుల స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నరు” అని రాజగోపాల్ ఫైర్ అయ్యారు.

మునుగోడుకు మంచి జరుగుతదని ఆశిస్తున్నా
తనను గెలిపించిన ప్రజలకు తాను అనున్నది ఏమీ చేయలేకపోయానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ‘‘ఎమ్మెల్యే పదవికి 18 నెలల సమయం ఉంది. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుం దేమో.. పెన్షన్లు వస్తయేమో.. కొంత మందికైనా లబ్ధి జరుగుతుందని పిస్తున్నది” అని అన్నారు. ఎవరో చెబితే తాను రాజీనామా చేయనని, తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందంటే చేద్దామనుకున్నాని చెప్పారు. డబ్బుల సంచులతో వస్తే ప్రజలే డిసైడ్ చేస్తారన్నారు. ఆత్మగౌరవం చంపుకొని, నిందలు మోసి, మాటలు పడి ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదన్నారు.

మచ్చలేని కుటుంబం నాది
“13 ఏండ్లుగా నిజాయితీగా పని చేస్తున్నా. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం బతుకుతరనే పేరుంది. మోసం చేయలేదు. రాజకీయం అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించలేదు. వ్యాపారంలో సంపాదించిన సొమ్ముతో పేదలను ఆదుకున్న చరిత్ర మాది. అలాంటి మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంట్రాక్టుల కోసం, డబ్బు కోసం పోతున్నానని అంటున్నరు. అందుకే అయితే తమ పార్టీలో చేరాలని టీఆర్ఎస్ వాళ్లు 2014 నుంచి అడుగుతున్నరు. పోలేదు. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం.. ఏ అనుమానం ఉన్నా ముఖం మీద సమాధానం చెబుతా. మూడేండ్ల కిందటే బీజేపీకి పాజిటివ్‌‌గా స్టేట్​మెంట్ ఇచ్చా” అని చెప్పారు. 
నా రాజీనామా అంశంపై రాష్ట్రంలో 10, 15 రోజులుగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మునుగోడు ప్రజలు కూడా అలాగే అనుకుంటరని కొంత సమయం తీసుకున్న. కానీ చర్చ రోజురోజుకూ పక్క దారి పడుతున్నది. మీడియాలో నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నరు. ప్రతిపక్షం కావొచ్చు, కాంగ్రెస్ వాళ్లు కావొచ్చు, గిట్టని వాళ్లు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే ఎక్కువగా నాన్చకూడదని అనుకున్నా.  మూడేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలే. పెన్షన్లు​, రుణమాఫీ, ఇండ్లు, నిరుద్యోగ భృతి.. ఇట్లా ఏ విషయంలోనూ ప్రభుత్వం నుంచి సాయం అందలే. అందుకే రాజీనామా చేస్తున్నా.
‑ కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి