మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మునుగోడులో గెలిస్తే రూ. 3వేల పింఛన్ ఇస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ త్వరగానే వంటపట్టిందని ఎద్దేవా చేశారు. రూ. 3 వేల రూపాయల పింఛన్ ఇస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రధాని మోడీ చేత చెప్పించాలని సవాల్ విసిరారు. దుబ్బాక, హుజురాబాద్లో గెలిస్తే..రూ. 3వేల పింఛన్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని..గెలిచాక..ప్రజలకు పింఛన్ పంపిణీ చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 3వేల పింఛన్ ఇవ్వడం లేదన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం రూ. 750 మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. మునుగోడులో ప్రతి ఇంటికి వెళ్ళి హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ నేతలు ఏం చెప్పారో వీడియో లు చూపిస్తామన్నారు.
అహంకారానికి..ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న ఎన్నిక అని మంత్రి హరీష్ రావు అన్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి..మునుగోడుకు చేసిందేమీ లేదన్నారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు గెలిచాకే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే..ఆయనకే లాభమని...అదే టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభమన్నారు.
తెలంగాణలో సంక్షేమ పాలన..
8 ఏళ్ల మోడీ పాలనలో విఫలం, విషం, విద్వేషం అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో దేశం 107 స్థానానికి పడిపోయిందని చెప్పారు. దేశంలో పేదరికం , ఆకలి పెరిగిందని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దేశం ర్యాంకు పడిపోయిందన్నారు. కానీ 8 ఏళ్ల తెలంగాణలో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం నల్గొండకే దక్కిందని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా పట్ల సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నారు. .నల్లగొండ జిల్లాకు కేసీఆర్ చేసిన మేలు ఎవరు చేయలేదని తెలిపారు. మునుగోడు ప్రజలకు మోడీపై కంటే...కేసీఆర్పైనే ప్రేమ ఎక్కువన్నారు. కృష్ణా వాటర్లో వాటా తేల్చకుండా మునుగోడుకు బిజెపి అన్యాయం చేసిందన్నారు. కృష్ణా నీళ్లలో వాటా తేల్చని బిజెపి కి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు.
