- తొలగించిన 90 లక్షల ఓట్ల కోసం కోర్టుకు వెళ్తాం: మమతా బెనర్జీ
- బెంగాలీ మాట్లాడేవారిపై చొరబాటుదారులుగా ముద్ర వేస్తున్నారు
- ఆగస్టు 2026 నాటికి బెంగాల్‌లో బీజేపీ అంతం ఖాయమని ఫైర్
కోల్‌కతా: చేపల ఉత్పత్తిలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. వాస్తవాలను ప్రధాని పూర్తిగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బెంగాల్‌లోని ప్రతి మార్కెట్‌లోనూ చేపలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, రాజస్తాన్, బిహార్‌లలో ప్రజలను చేపలు, మాంసం తిననివ్వడం లేదని ఆరోపించారు.
కానీ, బెంగాల్ ప్రజలకు నచ్చిన ఆహారాన్ని (చేపలు, మాంసం, గుడ్లు) తినే స్వేచ్ఛ ఉందన్నారు. ఆమె..ఉత్తర 24 పరగణాల జిల్లా అగర్‌పారాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. " చేపల ఉత్పత్తిలో మా ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో మేం ఏపీ నుంచి చేపలను దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు చేసుకోవట్లేదు. చేపల ఉత్పత్తి బెంగాల్ లో అద్భుతంగా ఉందని.
ఇది ప్రధాని గమనించాలి. మేం ఇక్కడి నుంచి ఒమన్‌కు బీఫ్ ఎగుమతి చేస్తున్నాం. ప్రజలు తమకు ఇష్టమైంది తినడానికి ఇక్కడ స్వేచ్ఛ ఉంది" అని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ 'సర్' పేరుతో ఓటర్ల జాబితా నుంచి 90 లక్షలకు పైగా పేర్లను తొలగించిందని మమత ఆరోపించారు. వాటిని తిరిగి చేర్చేందుకు కోర్టుకు వెళ్తామన్నారు. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో బీజేపీ అంతం కావడం ఖాయమన్నారు.
