దుబాయ్: ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో బ్రెజిల్ విమెన్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ లారా కార్డోసో సరికొత్త చరిత్ర సృష్టించింది. మెన్స్, విమెన్స్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కలహరి విమెన్స్ టీ20 టోర్నీలో భాగంగా గురువారం లెసోతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కార్డోసో ఈ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. కేవలం మూడు ఓవర్లు వేసిన కార్డోసో 4 రన్స్ ఇచ్చి హ్యాట్రిక్‌తో సహా 9 వికెట్లు తీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బ్రెజిల్ 20 ఓవర్లలో 202 రన్స్ చేసింది.
మోనికే మచాడో (69 నాటౌట్), రాబర్టా అవేరీ (48) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లెసోతో 13 రన్స్‌కే కుప్పకూలింది. ఫలితంగా బ్రెజిల్ 189 రన్స్ భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఛేజింగ్‌లో లెసోతోను కార్డోసో తన బౌలింగ్‌తో వణికించింది. రెండో ఓవర్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఆమె నాలుగో ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసింది. ఆరో ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చివరి వికెట్ మరియానే ఆర్తుర్ ఖాతాలోకి వెళ్లింది. 2025లో మయన్మార్‌పై 7 రన్స్ ఇచ్చి 8 వికెట్లు తీసిన భూటాన్ బౌలర్ సోనమ్ యెషీ రికార్డుతో పాటు 2024లో ఇండోనేసియా బౌలర్ రోహ్మాలియా నెలకొల్పిన 7/0 రికార్డును ఈ మ్యాచ్‌లో కార్డోసో బద్దలుకొట్టింది.
