తెలంగాణకు విముక్తి బీజేపీతోనే సాధ్యం

తెలంగాణకు విముక్తి బీజేపీతోనే సాధ్యం
  • ధర్మ యుద్ధంలో ప్రజలే గెలుస్తరు
  • మునుగోడులో నా రాజీనామా తర్వాతే అభివృద్ధి పనులు
  • కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 21న అమిత్ షా మీటింగ్ ఆగదు
  • తెలంగాణకు విముక్తి బీజేపీతోనే సాధ్యం: మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు:  రాష్ట్రంలో రాక్షస పాలనకు, ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతున్నదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ పోరాటంలో ధర్మం వైపు నిలబడి ప్రజలే గెలుస్తారని అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఈనెల 21న అమిత్ షా మీటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మీటింగ్ ఈ నెల 20న ఉంటే, అమిత్​షా సభకు ఆటంకం సృష్టించాలనే టీఆర్ఎస్ నాయకులు 21వ తేదీలో కూడా వాహనాలను బుక్ చేసుకున్నట్లు తెలిపారు.

మునుగోడులో తన రాజీనామా తర్వాతే అభివృద్ధి పనులు సాగుతున్నాయని పేర్కొ న్నారు. ఒక కుటుంబం చేతిలో బంధీ అయి న తెలంగాణకు విముక్తి కలగాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందనే ఆ పార్టీలో చేర బోతున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్​ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. పదవులు, కాంట్రాక్టుల కోసం పార్టీ మారేదుంటే 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే తానూ మారేవాణ్నని చెప్పారు. కేసీఆర్ అరాచక పాలన అంతమొందించాలని కంకణం కట్టుకున్నానని, అది కాంగ్రెస్ తో సాధ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించి ఈ ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు.