హరీశ్ రావు ఆరోపణలు హాస్యాస్పదం : మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి

హరీశ్ రావు ఆరోపణలు హాస్యాస్పదం : మంత్రి కోమటి రెడ్డి  వెంకట్‌‌‌‌ రెడ్డి
  • మీడియాతో మంత్రి వెంకట్‌‌‌‌రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావుపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన చిట్‌‌‌‌చాట్ చేశారు. హరీశ్‌‌‌‌రావు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. హ్యామ్ రోడ్ల టెండర్లు ఇంకా ఖరారు కాకముందే, కాంట్రాక్టర్లు ‘రిగ్’ అయ్యారంటూ హరీశ్‌‌‌‌ ఆరోపించడం హాస్యాస్పదమని మంత్రి కొట్టిపారేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ఆన్ రికార్డులో మాట్లాడితే అన్ని అంశాలకు తానే సమాధానం చెబుతానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం పంప్ హౌస్‌‌‌‌లలో నాసిరకం మోటార్లు పెట్టిందని మంత్రి ఆరోపించారు. 

నాణ్యత లేని పరికరాల వల్లే ప్రాజెక్టుల వద్ద సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. పంప్ హౌస్‌‌‌‌లకు ప్రభుత్వం కరెంట్ కోతలు విధిస్తున్నదని హరీశ్‌‌‌‌రావు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. చేతనైతే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరారు. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.