కలిసికట్టుగా కాంగ్రెస్ను అధికారంలోకి తెద్దాం

కలిసికట్టుగా కాంగ్రెస్ను అధికారంలోకి తెద్దాం

పేదవాడి గుండెల్లో పీజేఆర్ చెదరని ముద్ర వేశారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. విజయారెడ్డి రాకతో జంటనగరాల్లో మళ్లీ బలం వచ్చినట్లైందని అన్నారు. పీజేఆర్ బిడ్డకు పార్టీలో మంచి గౌరవం ఉంటుందని.. తాను కూడా పీజేఆర్ వెనుక తిరిగానని తెలిపారు. హైదరాబాద్ ను పీజేఆర్ చాలా అభివృద్ధి చేశారని.. మెట్రో,ఎయిర్పోర్టు కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని చెప్పారు. ఖైరతాబాద్ కాదు..హైదరాబాద్ లో ఎక్కడ నిలబడ్డా విజయారెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తుందన్నారు. ‘‘పెద్దమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా ప్రజల అండ పీజేఆర్ బిడ్డకు ఉంటుందని’’ వ్యాఖ్యానించారు. అందరం కలిసి పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

ఇక అసెంబ్లీని గడగడలాడించిన నాయకుడు పీజేఆర్ అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. నగరానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన నేత పీజేఆర్ అని కొనియాడారు. జంటనగరాల్లో పేదలకు అండగా ఉన్న పీజేఆర్ కూతురు తిరిగి కాంగ్రెస్ లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఖైరతాబాద్ కార్పొరేటర్ అయిన విజయారెడ్డి కొన్నాళ్లుగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని..అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.