నల్గొండను ఎందుకు దత్తత తీసుకోలే?: ఎంపీ కోమటిరెట్టి వెంకట్ రెడ్డి

నల్గొండను ఎందుకు దత్తత తీసుకోలే?: ఎంపీ కోమటిరెట్టి వెంకట్ రెడ్డి
  • ఐదేండ్లలో ఎమ్మెల్యే ఏం చేశారని నిలదీత

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్  ఎందుకు అభివృద్ధి చేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బ్రాహ్మణ–-వెల్లంల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని, నల్గొండను ఎందుకు దత్తత తీసుకోలేదని ఆయన నిలదీశారు. నల్గొండ పట్టణంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు వీటీ కాలనీలోని భూదేవి, శ్రీదేవిసహిత వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.

అనంతరం ఇంటింటికీ వెళ్లి ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్  ఎమ్మెల్యే భూపాల్  రెడ్డి వైఖరి నచ్చకనే బీఆర్ఎస్   కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. పార్టీ మారిన వారిపై అభాండాలు వేస్తే సహించనన్నారు. తాను ఎంపీగా ఉన్నా నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించానని చెప్పారు. కానీ, ఎమ్మెల్యే ఈ ఐదేండ్లలో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కనీసం రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ లో నాయకులను, కార్యకర్తలను గౌరవించే సంస్కృతి లేదన్నారు.  మరో 45 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షమమే ధ్యేయంగా పాలన సాగిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ క్యాంపు కార్యాలయంలో కనగల్, తిప్పర్తి , నల్గొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్  పార్టీ కార్యకర్తలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా బైక్  ర్యాలీ నిర్వహించారు.