కాళేశ్వరంలోకి నీళ్లు పైకి తెచ్చి కిందికి వదలడం.. తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 కాళేశ్వరంలోకి నీళ్లు పైకి తెచ్చి కిందికి వదలడం.. తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడే కట్టి ఉంటే ప్రాజెక్టు 8 ఏండ్ల కిందే పూర్తయ్యేదని, వికారాబాద్, చేవెళ్ల వరకు గ్రావిటీ ద్వారా సాగు నీరు వచ్చేదని చెప్పారు. ‘‘ప్రాణహితకు రూ.38 వేలకోట్లు ఖర్చవుతుందని నాడు అంచనా వేశారు. ఎస్టిమేషన్స్ పెరిగినా మరో 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. 

అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉండాల్సింది. కాళేశ్వరం అద్భుత కట్టడమని అంతకు ముందు భారీగా ప్రచారం చేసుకున్నారు. అక్టోబర్​ 21న మేడిగడ్డ కుంగిపోవడంతో ప్రజలకు అనుమానాలు వచ్చాయి. గ్రావిటీ ద్వారా కిందికి వెళ్లాల్సిన నీటిని.. మూడు బ్యారేజీలు కట్టి పైకి తెచ్చి మళ్లీ కిందికి వదిలిపెట్టడం తుగ్లక్ చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టారని, ఆ డబ్బు వృథా అని అసెంబ్లీలోనే చెప్పానన్నారు.

దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసి, ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇంజనీరింగ్​ మార్వెల్​ అని ప్రచారం చేసుకుంది. కానీ, కరెంటు బిల్లుల భారం తప్ప.. దాని వల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని మంత్రుల తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్‌హౌస్‌ మునిగిపోవడం.. ఐదేండ్లకే ప్రధాన బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి బుంగలు పడటం.. కాళేశ్వరం పరిస్థితిని తెలియ జేస్తున్నదని మంత్రులు అన్నారు. ‘‘ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు. అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకం ప్రాజెక్టు’’ అని మండిపడ్డారు.