ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే:కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్, నార్కట్ పల్లి, వెలుగు: ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్గొండలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద పూజలు వెంకట్​రెడ్డి పూజలు చేశారు. అనంతరం  నార్కట్​పల్లిలోని వివేరా హోటల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో  400 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

ఆమె గ్రూప్‌‌‌‌–2 ఎగ్జామ్‌‌‌‌కు అప్లై చేయలేదని,  ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం తల్లిదండ్రులను మరింత బాధకు గురిచేసిందన్నారు. ప్రవళిక వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుందని ఆధారాలతో సహా ఈ రోజు పత్రికల్లో వేశారని చెప్పారు.  యువత ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  సోనియా గాంధీ  ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో కేసీఆర్, కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నల్గొండ నుంచి పోటీ చేస్తున్న తనను, నకిరేకల్‌‌‌‌లో వేముల వీరేశాన్ని 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టణ అధ్యక్షుడు మోహన్​రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.