తెలంగాణ శాసనమండలికి కొత్త బిల్డింగ్

తెలంగాణ శాసనమండలికి కొత్త బిల్డింగ్
  • మండలికి కొత్త బిల్డింగ్
  • అసెంబ్లీ ఆవరణలో ఆరు నెలల్లో నిర్మిస్తం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
  • ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ జరిపిస్తం
  • మా ప్రభుత్వం ఏర్పడిన రెండ్రోజులకే హరీశ్ విమర్శలు చేస్తున్నడు 
  • పదేండ్ల పాలనలో వాళ్లేం చేసిన్రని ఫైర్
  • మంత్రిగా బాధ్యతల స్వీకరణ.. 9 ఫైళ్లపై సంతకం 

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఆవరణలో శాసన మండలికి కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని ఆర్​ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం సెక్రటేరియెట్ లో మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా 9 ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ఆవరణలో పార్టీల ఎల్పీలకు కేటాయించిన బిల్డింగులను కూల్చేసి, ఆ ప్లేసులో కౌన్సిల్ భవనం కడతామని కోమటిరెడ్డి తెలిపారు. ‘‘ప్రస్తుతమున్న అసెంబ్లీ బిల్డింగ్ ను కలుపుతూ మండలి భవనం నిర్మిస్తాం. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండేలా నిర్మాణం ఉంటుంది. మధ్యలో సెంట్రల్ హాల్ నిర్మించి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుసుకునేలా బిల్డింగ్ కడతాం. దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. రెండ్రోజుల్లో సీఎం, నేను కలిసి అసెంబ్లీ పరిసరాలను పరిశీలిస్తాం. పబ్లిక్ గార్డెన్ నుంచి లలితా కళాతోరణం వరకు అసెంబ్లీ ప్రాంతాన్ని సుందరీకరణ చేసి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం” అని చెప్పారు. 

బీఆర్ఎస్ పాలనలో రోడ్లు అస్తవ్యస్తం..  

తమ ప్రభుత్వం ఏర్పడి రెండ్రోజులు కూడా కాకముందే రైతుబంధు ఎప్పుడిస్తరని హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, మరి పదేండ్ల పాలనలో వాళ్లేం చేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. “రోడ్ల గురించి 2014లో కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ ముందు నీళ్లు అగుతున్నయని అన్నరు. మరి పదేండ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా పరిస్థితి అట్లనే ఉన్నది. 

వర్షం వస్తే రోడ్లు చెరువులు అయితున్నయ్” అని అన్నారు. హైదరాబాద్, విజయవాడ హైవేను ఆరు లేన్లుగా విస్తరించే పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. అది పూర్తయితే రెండున్నర గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చని చెప్పారు. భువనగిరిలో రూ.250 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని ప్రకటించారు. రానున్న వంద రోజుల్లో తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. కాగా, సోమవారం ఢిల్లీకి వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తానని చెప్పారు. 

వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్.. 

ఆర్అండ్ బీ డిపార్ట్​మెంట్​లో రూ.వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని కోమటిరెడ్డి తెలిపారు. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల విషయంలో కాంట్రాక్టర్​తో సమస్య ఉందన్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ జరిపిస్తామని చెప్పారు. సెక్రటేరియెట్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మాణ పనుల్లో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తారా? ఆర్అండ్ బీ శాఖలో ఎక్స్ టెన్షన్​పై కొనసాగుతున్న అధికారులను తొలగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా... రానున్న రోజుల్లో అన్ని అంశాలపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కావాలని ఎవరి మీద కక్షపూరితంగా వ్యవహరించబోమన్నారు. మంత్రి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, అనిల్ కుమార్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేముల వీరేశం, అనిరుధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ప్రతి రోజూ ప్రజా దర్బార్.. 

ప్రతి రోజూ మినిస్టర్ క్వార్టర్స్ లో గంట సేపు ప్రజా దర్బార్ నిర్వహిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. ‘‘ఉదయం 10:30 గంటలకు సెక్రటేరియెట్​కు వస్తాను. మూడ్రోజులు సెక్రటేరియెట్​లో ఉంటాను. మూడ్రోజులు జిల్లాల పర్యటనకు వెళ్తాను. వారంలో ఒక రోజు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో రోడ్ల పనులపై మాట్లాడతాను” అని చెప్పారు.