మునుగోడు ప్రచారానికి సిద్ధమన్న వెంకట్ రెడ్డి

మునుగోడు ప్రచారానికి సిద్ధమన్న వెంకట్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వెళ్తానని  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే  వెంటనే ప్రచారం చేసేందుకు వస్తానని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటీ అయిన ఆయన..మునుగోడు ఉపఎన్నిక.. పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు..అభ్యర్థి ఎంపిక వంటి  అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

మా నాయకుడు చెప్పాడు..
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాలను సీఎల్పీ నేత  భట్టి విక్రమార్కకు తెలిపానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఎవరి పేరు సూచించానో చెప్పలేనని..అది పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని  ప్రియాంక గాంధీకి చెప్పాన్నారు.  ఇప్పుడు మా నాయకుడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చెప్పానని అన్నారు. 

అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డికి వివరించా..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లిన భట్టి విక్రమార్క..దాదాపు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో జరిగిన కసరత్తుపై కోమటిరెడ్డికి వివరించానని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ఆశావహుల పేర్లను తెలియజేశానన్నారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అభిప్రాయాన్ని  వెల్లడించినట్లు చెప్పారు. 

ప్రియాంక గాంధీతో భేటీ...
కాంగ్రెస్ లో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల, మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ ను  బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ వెంకట్ రెడ్డికి సూచించారు. దాదాపు 40 నిమిషాలపాటు ప్రియాంక గాంధీతో  సమావేశమై...పార్టీకి చెందిన అంశాలపై చర్చించానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అటు  మునుగోడు అభ్యర్ధి ఎంపిక విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో చర్చించాలని పార్టీ నేతలకు ప్రియాంక గాంధీ ఆదేశించారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుపుకుని వెళ్లాలని సూచించారు.