
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. నల్గొండ నియోజకవర్గంలో రూ. 99.8 కోట్లతో 4 రోడ్ల విస్తరణకు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు బుధవారం జీవో జారీ చేశారు. దీనిపై మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నాలుగు ప్రతిపాదిత రహదారులపై గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించకోలేదని ఆరోపించారు.
నల్గొండ రోడ్ల దుస్థితి గురించి జిల్లా ప్రజలు, పత్రికలు, టీవీ చానెల్స్ కొన్ని వందలసార్లు తెలియజేసినా కనీస స్పందన కరువయ్యిందని ఒక ప్రకటనలో తెలిపారు. గుంతలు పడిన రోడ్ల వల్ల జరిగిన ప్రమాదాలతో యువకులు చనిపోతుంటే తన మనసు చలించిపోయిందని చెప్పారు. దీనిపై సీఎంకు వివరించి రోడ్లు శాంక్షన్ అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నానని వివరించారు.
కాంగ్రెస్ పార్టీని ఆదరించిన నల్గొండ జిల్లా ప్రజల రుణం తీర్చుకుందామనే నెల రోజుల్లో నాలుగు రోడ్లను మంజూరు చేయించినట్టు తెలిపారు. రోడ్లను నాణ్యత ప్రమాణాలతో ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటానని వివరించారు. స్వయంగా తానే నిర్మాణ పనులను పర్యవేక్షిస్తానన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రతీ రోడ్డును అభివృద్ధి చేసి తెలంగాణను ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.