నాకు ప్రజాబలం ఉంది.. కేసులకు భయపడ: కొండా మురళి

నాకు ప్రజాబలం ఉంది.. కేసులకు భయపడ: కొండా మురళి

తనకు ప్రజా బలం ఉందని.. కేసులకు భయపడేది లేదని అన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.  తాను వెనుబడిన వర్గాల ప్రజాప్రతినిధిని అని చెప్పారు. తాను ఇతరుల గురించి కామెంట్ చేయబోనని అన్నారు.  44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ కొనసాగుతోందన్నారు. తనకు భయపడకపోతే  23 కేసులు పెట్టకపోయేవాళ్ళని చెప్పారు.   హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో  కొండా దంపతులు భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు . 16 పేజీల నివేదికను మీనాక్షి నటరాజన్ కు అందించారు.  

అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి..క్రమశిక్షణ కమిటీ ముందున్నా..తనను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఉమ్మడి వరంగల్ లో అన్ని స్థానాలు కాంగ్రెస్ కు వచ్చేలా పనిచేస్తానన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పారు కొండా మురళి.  ఎలాంటి గ్రూపు రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు మురళి. వైఎస్సార్ నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నానని.. పనిచేసే వారిపైనే రాళ్లు విసురుతారని చెప్పారు.  తన కూతురు పరకాలలలో పోటీచేసే విషయం తనకు తెల్వదన్నారు.  ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని అన్నారు. 

నేను తప్పు చేయలే..అది నా కూతురి ఇష్టం 


పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ తో భేటీ అయిన  కొండా సురేఖ..మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించానని చెప్పారు. ఎలాంటి తప్పు చేయలేదన్నారు.  తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తన  కూతురికి ఉందన్నారు సురేఖ. తన ఆలోచనను తాము కాదనలేమన్నారు. కొండా సురేఖ కూతురు పరకాల నుంచి  పోటీచేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. 

ఇటీవలే సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొండా మురళికి వ్యతిరేకంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. కొండామురళిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే  కొండామురళి దంపతులు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు హాజరై వివరణ ఇచ్చారు.  మళ్లీ ఇవాళ జూలై 3న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. 16 పేజీల నివేదిక ఇచ్చిన కొండాదంపతులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు.