
- వారి త్యాగాలను వృథాకానివ్వం: మంత్రి కొండా సురేఖ
- జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళి
హైదరాబాద్, వెలుగు: అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, ముఠాలకు ఎదురొడ్డి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వారి కుటుంబాలకు సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ బహదూర్‌పురలోని నెహ్రూ జూ పార్కులో అటవీ అమరవీరుల స్తూపం వద్ద మంత్రితో పాటు సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.
అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తున్నామని చెప్పారు. కలప అక్రమ రవాణాను కట్టడికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకెళ్తున్నారన్నారు. అటవీ సంరక్షణ బలోపేతానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. 307 కోట్ల మొక్కలు నాటాం..
వన మహోత్సవం భాగంగా రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను నాటామని మంత్రి కొండా సురరేఖ అన్నారు. పీడీ యాక్టుకు సవరణలు చేసి ఫారెస్టు అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ.. అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి గొప్పదన్నారు. ప్రకృతిని కాపాడటం కోసం అటవీ అధికారులు ప్రాణత్యాగం చేశారని, అలాంటి వారిని గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ స్మగ్లర్లను ఎదుర్కొంటూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారులు కృషి గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, సీసీఎఫ్‌లు ప్రియాంక వర్గీస్, రామలింగం పాల్గొన్నారు.