సైబరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ కు  భూమిపూజ

సైబరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ కు  భూమిపూజ
  • మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్​లోని నల్లగండ్ల-–గోపన్ పల్లిలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్కాన్ సంస్థకు నల్లగండ్ల–గోపన్నపల్లిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం పక్కన 6 వేల గజాల భూమిని కేటాయించింది. గోపూజ, గురుపూజ, సుదర్శన నరసింహ హోమం, పూర్ణాహుతి, మహాన్నదానం నిర్వహించిన తర్వాత మంత్రి సురేఖ మాట్లాడారు. ఆధ్యాత్మిక విలువలు, నైపుణ్యాభివృద్ధి కలిసినప్పుడు మాత్రమే సమాజం సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సైబరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటని, ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణం శుభపరిణామమని పేర్కొన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 20 మంది మహిళలకు నారీ పురస్కార్–2026 అవార్డులను అందజేశారు. ఇస్కాన్ సైబరాబాద్ ఆలయ అధ్యక్షుడు శ్రీరామ్ దాస్, ప్రభూజీలు, ప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్, ఎండోమెంట్​ఆఫీసర్లు పాల్గొన్నారు.