మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

గండిపేట, వెలుగు: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప్పర్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం రాజేంద్రనగర్‌ నియోజకవర్గ బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. 

ప్రతి కార్యకర్త లోక్​సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. జనం తనపై చూపిస్తున్న ప్రేమ, వారి ముఖంలోని చిరునవ్వే తన విజయానికి నాందిగా భావిస్తున్నానన్నారు. ఏ సర్వే చూసినా బీజేపీనే గెలుస్తుందని చెబుతుందన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌తో మెజారిటీ విషయంలో తాను పోటీ పడుతున్నానని చెప్పారు. 

ఈ పోటీలో తానే గెలుస్తానని విశ్వేశ్వర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు బుక్క వేణుగోపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.