ప్రభుత్వ లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు

మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఈ మేరకు జిల్లా కలెక్టర్ ,ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  

 హరీశ్వర్​రెడ్డి సీఎం కేసీఆర్​కు సన్నిహితుడు.ఆయన మృతిపై కేసీఆర్ సంతాపం తెలిపారు. జనాలకు హరీశ్వర్ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి తండ్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి సెప్టెంబర్ 22 రాత్రి కన్నుమూశారు.   శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో కుటుంబసభ్యులు సీపీఆర్ చేస్తూ అంబులెన్స్​లో పరిగి ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. శ్వాస సరిగా ఆడకపోవడంతో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

హరీశ్వర్‌రెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1994 నుంచి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా  టీడీపీ నుంచి వరుసగా గెలుపొందారు. 2001 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్​గా ఉన్నారు. 2012లో టీడీపీ నుంచి బీఆర్ఎస్​లో చేరారు. 2014లో బీఆర్ఎస్​ నుంచి పరిగిఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.