
- కాంగ్రెస్ సనత్నగర్ సెగ్మెంట్ అభ్యర్థి కోట నీలిమ
- భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం ప్రారంభం
సికింద్రాబాద్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని సనత్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ ఆరోపించారు. సనత్ నగర్ సెగ్మెంట్ లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఆమె ఘనంగా ప్రారంభించారు. మోండా మార్కెట్ డివిజన్ నుంచి వెయ్యికి పైగా బైకుల్లో 2 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించారు. బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట, బేగంపేట, అమీర్ పేట నుంచి సనత్ నగర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
జనం సమస్యలను పట్టించుకోని నాయకులకు బుద్ధిచెప్పాలన్నారు. సనత్ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కోట నీలిమ ధీమా వ్యక్తం చేశారు. గెలుపు దక్కే వరకు కార్యకర్తలు ఇలాగే ఉత్సాహంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.