విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కొత్త మనోహర్ రెడ్డి మద్దతు పలికారు. టీఆర్ఎస్ పార్టీ పేరును భ్రష్టు పట్టిస్తున్నారని తెలిపారు. గత వారం రోజుల నుండి వస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలను మంత్రి ప్రోత్సాహిస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుచరులతో కబ్జాలను ప్రోత్సహించి టీఆర్ఎస్ పార్టీ పరువు తీస్తున్నారని విమర్శించారు. ఉద్యమం నాటి నుండి ఉన్న వారిని టీఆర్ఎస్ పార్టీ అణిచివేస్తోందన్నారు. మహేశ్వరం నియోజవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. డీసీఎం అడ్డాను తొలగించి రూ. 50 లక్షల ప్రజాధనంతో నిర్మిస్తున్న షెడ్లను ఆయన వ్యతిరేకించారు. కబ్జాకు గురవుతున్న సందె చెరువు పక్కన గల ఎఫ్ టిఎల్ ల్యాండ్ లో షెడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ స్థలాలను వదలడం లేదని తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మీర్పేట్ ప్రాంతాన్ని సబిత నాశనం చేస్తున్నారంటూ మంత్రాల చెరువును పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచెయ్యలేదన్నారు. మంత్రి అరాచకాలపై చూస్తూ ఊరుకోనని..అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని తీగల కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. దీనికి మంత్రి సబితా స్పందించారు. ఆయనను ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. భూకబ్జా ఆరోపణలపై తీగలను కలిసి మాట్లాడతానని చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడికే విచారణ జరుపుకోవచ్చని సబిత స్పష్టం చేశారు.
